టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 ఎగ్జామ్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 ఎగ్జామ్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • జిల్లాల్లో స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తం
  • ఇకపై కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అధికారులే ఇస్తరు 
  • ఆడపిల్లల పెండ్లి సమయంలోనే రూ.లక్ష చెక్కు, తులం బంగారం అందజేస్తాం 
  • త్వరలోనే ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని మంత్రి వెల్లడి 

నల్గొండ, వెలుగు : ఫిబ్రవరిలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్​ ఇస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం నల్గొండలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘పదేండ్లు పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్లను రిక్రూట్ చేయలేదు. వేలాది మంది టీచర్లు రిటైర్ మెంట్ అయినా, ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. రాష్ట్రంలో బీఈడీ పూర్తి చేసినోళ్లు లక్షల్లో ఉన్నారు. ఎంత చేసినా రెండు, మూడు లక్షల మందిని మాత్రమే సర్దుబాటు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జిల్లాల్లో స్కిల్​డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నాం. నల్గొండ కలెక్టర్​ సూచన మేరకు త్వరలో 70 వేల మందికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్ మెంట్​సెంటర్​ ఏర్పాటు చేస్తాం” అని చెప్పారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. 

ఇకపై చెక్కుల పంపిణీకి రాను..  

ఇకపై కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అధికారులే పంపిణీ చేస్తారని.. ఈ కార్యక్రమాలకు తాను రానని వెంకట్ రెడ్డి చెప్పారు. ‘‘గత ప్రభుత్వంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకే వచ్చేవి. అంతేగాక ఎమ్మెల్యేల చేతుల మీదుగానే పంపిణీ చేసేవారు. దాని వల్ల చెక్కుల పంపిణీ ఆలస్యమయ్యేది. కొంత పని ఒత్తిడి వల్ల నేను చెక్కులు పంపిణీ చేయడం ఆలస్యమైంది. ఇక నుంచి చెక్కుల పంపిణీ కార్యక్రమాలకు నేను రాను. ఇదే చివరి కార్యక్రమం. ఇక నుంచి అధికారులే గ్రామాలకు వచ్చి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు” అని తెలిపారు. అర్హుల ఎంపిక కూడా పారదర్శకంగా చేపడతామని, అర్హులైన పేదలకే లబ్ధి చేకూరేలా అధికారులే గ్రామ సభల ద్వారా ఎంపిక చేస్తారన్నారు. 

ఆడపిల్లల పెండ్లి సమయంలోనే రూ.లక్ష చెక్కుతో పాటు తులం బంగారం అందజేస్తామని తెలిపారు. తులం బంగారం పంపిణీపై త్వరలోనే కేబినెట్ మీటింగ్​లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, రూ.500కే గ్యాస్​ సిలిండర్.. ఏ పథకమైనా సరే గ్రామ సభల్లోనే అర్హులను ఎంపిక చేస్తారు. ఎమ్మెల్యేగా నేను ఎవరికి సిఫార్సు చేయాల్సిన అవసరం ఉండదు. త్వరలో రూ.10 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అందజేస్తాం” అని వెల్లడించారు. కాగా, జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నల్గొండ పట్టణంలో రూ.90 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు, రూ.1.30 కోట్ల నిధులతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.