ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తలో దారి..

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తలో దారి..

వరుస ఓటమిలతో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీకి.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సవాల్ గా మారాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు, అభ్యర్థులు పనిచేస్తున్నారు. కానీ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు, సోషల్ మీడియాలో నేతల అనుచరుల కామెంట్లు.. ఎమ్మెల్సీ అభ్యర్థులను పరేషాన్ చేస్తున్నాయి. 2014 నుంచి వరుస ఎన్నికల్లో ఓటమి తప్పడం లేదు. ప్రస్తుతం రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి.. క్యాడర్ లో జోష్ నింపాలని చూస్తున్నారు నేతలు. సర్కార్ పై పట్టభద్రులకు, ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసివస్తుందని భావిస్తున్నారు. కానీ పార్టీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రభావం పడుతుందంటున్నారు సీనియర్ లీడర్లు.

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ నుంచి రాములు నాయక్ బరిలో ఉన్నారు. రాములునాయక్ గెలుపు కోసం పీసీసీ చీఫ్ ఉత్తమ్ పూర్తి స్థాయిలో కసరత్తు చేసున్నారు. అన్నీ తానై మూడు జిల్లాల్లో ప్రచార, సన్నాహక సమావేశాల్లో పాల్గొంటున్నారు. మిగతా నేతలు మాత్రం పేరుకే హాజరవుతున్న వాదనలున్నాయి.  చాలామంది రాములునాయక్ కు సహకరించటం లేదనే గాంధీ భవన్ వర్గాల టాక్.

మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానంలో బరిలో ఉన్న చిన్నారెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉందంటున్నారు నేతలు. ఇప్పటికే ఇక్కడి నుంచి టికెట్ ఆశించి… భంగపడిన హర్షవర్ధన్ రెడ్డి …. పార్టీకి రిజైన్ చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి చిన్నారెడ్డి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. వరుస సభలు, సమావేశాలతో బిజీగా ఉన్నారు. అయినా చిన్నారెడ్డికి వర్గ పోరు తప్పటం లేదు. కొందరు నేతలు సన్నాహక సమావేశాలకు వస్తున్నా ఎదురు గాలి తప్పదనే టాక్ పార్టీలో వినిపిస్తోంది.

నేతల అనుచరులు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కూడా పార్టీకి ఇబ్బందిగా మారాయి. నేతల మధ్య గ్యాప్ పెంచుతున్నాయి. కొందరు నేతల అనుచరులు పెట్టే పోషల్ మీడియా పోస్టులపై బహిరంగంగానే ఫైరయ్యారు సీనియర్ నేత జానారెడ్డి. ఇలాంటి పనులతో పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిపోతోందన్నారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేస్తే.. సహించేది లేదన్నారు. ఈ విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు, సోషల్ మీడియా పోస్ట్ లు నాయకుల మధ్య విభేదాలు పెంచుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో.. పార్టీలోని అంతర్గత విభేదాలు అభ్యర్థులకు తలనొప్పిగా మారాయి.