పోకిరీలు వేధిస్తున్నరు : షీటీమ్స్ కి పెరుగుతున్న కేసులు

పోకిరీలు వేధిస్తున్నరు : షీటీమ్స్ కి పెరుగుతున్న కేసులు

బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఆటో స్టాండ్స్ అడ్డా
ఇలాంటి ఏరియాల్లో నిఘా పెట్టనున్న పోలీసులు
నిర్భయ యాక్ట్ కింద ఏటా150కి పైగా కేసులు
నమోదు చేస్తున్న షీటీమ్స్

హైదరాబాద్,వెలుగు: నిర్భయ లాంటి చట్టాలతో యువతులను వేధిస్తున్న వారిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నా పోకిరీలు రెచ్చిపోతూనే ఉన్నారు. ఓ వైపు సోషల్ మీడియా మరోవైపు కాలేజీలు,బస్ స్టాండ్స్,కార్పొరేట్ ఆఫీసులు,లేడీస్ హాస్టల్స్ వద్ద ఆవారాలు మహిళలు, యువతులను వేధిస్తున్న ఘటనలు 3 కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్నాయి . సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో యువతులు,విద్యార్థినులు, ప్రేమజంటలు, ఒంటరి మహిళలను వేధిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు.  షీ టీమ్స్,పెట్రోలింగ్ పోలీసులను లెక్కచేయకుండా ఈవ్ టీజింగ్ కి పాల్పడుతున్నారు.  రోడ్ల పక్కన బార్లు,వైన్స్ రూట్ లో వెళ్లే  మహిళలను ఆకతాయిలు అసభ్యంగా ట్రీట్ చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ఏంచేయాలో తెలియక బాధిత మహిళలు తలదించుకుని వెళ్తున్నారు. శంషాబాద్ లో యువతిపై జరిగిన అత్యాచారం,హత్య నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇలాంటి ప్రాంతాల్లో నిఘా పెట్టేందుకు ప్లానింగ్ రూపొందిస్తున్నారు.

 ఆటో డ్రైవర్ల మిస్ బిహేవియర్

ఆటోడ్రైవర్లు మహిళా ప్యాసింజర్స్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని ఆటో స్టాండ్స్ తో పాటు కోఠి,బంజారాహిల్స్,జూబ్లీహిల్స్ సహా సిటీలోని ఆటో స్టాండ్స్ వద్ద మహిళలను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఆటోల్లో కూర్చుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే మహిళలను కామెంట్ చేయడం కామన్ గా మారింది. ఆటో స్టాండ్స్ కి వచ్చే  విమెన్ ప్యాసింజర్స్ ను ఎక్కించుకునే సమయంలో  డ్రైవర్ల తీరు వారికి ఇబ్బందికరంగా ఉంటోంది. శివారు ప్రాంతాల్లోని బస్ స్టాప్స్ లో  రాత్రి 9 గంటలు దాటితే మద్యం మత్తులో హంగామా చేస్తున్నారు. బస్ స్టాండ్ లో ఆటోలు నిలిపి బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాగిన మైకంలో ఆటోలు ర్యాష్ డ్రైవ్ చేస్తూ అక్కడ నిల్చున్న వారిని భయ భ్రాంతులకు గురిచేస్తున్నారు.

దూరప్రాంతాలకు వెళ్లే వారి పట్ల అసభ్య ప్రవర్తన

రాత్రి 10గంటల తరువాత రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ వద్ద ఉండే పోకిరీల వల్ల దూర ప్రాంతాలకు వెళ్ళే విమెన్ ప్యాసింజర్లు, యువతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ సరిగా లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఉప్పల్,ఎల్బీనగర్ రింగ్ రోడ్డు లాంటి ఏరియాల్లో ఆవారాలు రెచ్చిపోతున్నారు.
రాత్రి వేళల్లో దూర ప్రాంతాలకు ప్రయాణించే మహిళల పట్ల ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో నైట్ రోమియోలు చేసే న్యూసెన్స్ కు ప్యాసింజర్లు విసిగిపోతున్నారు. ఇలాంటి కేసుల్లో బాధితుల నుంచి సమాచారం అందుకునే స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. ఈవ్ టీజింగ్ కి పాల్పడుతున్న ఆవారాలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. తీవ్రమైన నేరాల్లో నిర్భయ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకి
పంపుతున్నారు.