
హైదరాబాద్, వెలుగు : లాక్ డౌన్‌తో సిటీలో ఐదు నెలలుగా వేలాడుతున్న టు లెట్ బోర్డులు ఒక్కొక్కటిగా ఎగిరిపోతున్నాయి. కరోనా భయంతో 10లక్షల మందికిపైగా సొంతూళ్ల బాట పట్టడంతో కాలనీలు, బస్తీలు, అపార్టుమెంట్లలో పోర్షన్లు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఊళ్లల్లోనూ కరోనా కేసులు పెరుగుతుండడం, అన్ లాక్ 4తో మళ్లీ సాధారణ పరిస్థితులు మొదలవుతుండడంతో పల్లెల నుంచి సిటీకి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దాంతో తక్కువ కిరాయి ఉన్న ఇళ్లు హాట్‌కేక్‌లా అద్దెకి పోతున్నాయి. కిరాయి భారం తగ్గించుకునేందుకు శివార్లకు షిప్ట్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. రెంటల్ బిజినెస్ పుంజుకుంటోందని ఏజెంట్లు చెప్తున్నారు.
తగ్గిన అద్దెలు
కోర్ సిటీలో నెలల తరబడి పోర్షన్లను ఖాళీగా ఉంచడం ఇష్టం లేక ఓనర్లు పాత రెంట్కంటే రూ.వెయ్యి తగ్గించి చెప్తున్నారు. శివారు ప్రాంతాల్లో కిరాయికి ఉండేవాళ్లలో చాలామంది సొంతూళ్లకు వెళ్లడంతో ఇక్కడ టు లెట్బోర్డులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ ఇండ్లను మరింత తక్కువకి ఇచ్చేందుకు ఓనర్లు ముందుకొస్తున్నారు. ప్రధాన కాలనీలు, మెయిన్ సెంటర్లలో రూ.7,500 నుంచి రూ.8,500 కిరాయి ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పుడు రూ.6,500–7వేలకే దొరుకుతున్నాయి. సింగిల్ బెడ్రూం ధరలోనే డబుల్ బెడ్రూం పోర్షన్లు ఇస్తున్నారు. హయత్ నగర్, సంతోష్ నగర్, బాలాపూర్, రాజేంద్ర నగర్, బాచుపల్లి, సికింద్రాబాద్, బాలానగర్, ఆల్వాల్, తిరుమలగిరి, శామీర్ పేట, పటాన్ చెరు, బోడుప్పల్, బీఎన్ రెడ్డి వంటి ఏరియాల్లో రెంటల్ హౌజెస్ రూ. 1500 నుంచి రూ. 2వేలు తక్కువకి ఇస్తున్నారు.
కంఫర్ట్ కు ప్రయారిటీ
గతంలో రెంట్ ఎక్కువైనా సిటీ మధ్యలో ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిన వాళ్లు కరోనా భయంతో శివారు ప్రాంతాలకు వెళ్తున్నారు. సింగిల్ బెడ్రూమ్లో ఉన్నవాళ్లు దూరమైనా డబుల్ బెడ్రూం ఇంట్లో ఉండాలనుకుంటున్నారు. విశాలంగా, వెంటిలేషన్ ఉండేలా ఇల్లు దొరికితే జాబ్ ఏరియాకు దూరమైన ఫర్లేదంటున్నారు. రెంట్తోపాటు మెయింటెన్స్కూడా తక్కువ ఉండడంతో శివార్లలో సౌకర్యాలు ఉన్న ప్రాంతానికి షిప్ట్ అవుతున్నారు.
ఇండ్ల కోసం వెతికే వాళ్లు పెరిగిన్రు
అన్ లాక్ తర్వాత రెంటల్ బిజినెస్ పుంజుకుంటోంది. ఉన్న ఇంటి నుంచి వేరే ఇంటికి మారాలనుకుంటున్న వాళ్లూ పెరిగిన్రు. ఇండ్ల కోసం వెదికే వారి సంఖ్య నెల రోజులుగా పెరుగుతోంది. అన్ లాక్ తో ఆఫీసులు, బిజినెస్‌లు తిరిగి స్టార్ట్ అవడంతో ఊళ్లకి వెళ్లినవారూ తిరిగొస్తున్నరు.
‑ నర్సింగ్ యాదవ్, రెంటల్ ఏజెంట్, ఉప్పల్
దూరమైనా విశాలంగా ఉండాలని..
కేపీహెచ్బీలో సింగిల్ బెడ్రూం ఇంట్లో రెండేండ్లు ఉన్నాం. కరోనా టైం కావడంతో కాస్తా విశాలమైన ఇంటికి మారాలని డిసైడ్ అయ్యాం. ఆఫీస్‌కి దూరమైనా బాచుపల్లిలో ఇప్పుడున్న రెంట్లోనే మంచి దొరికింది. ఈ మధ్యే షిఫ్ట్ అయ్యాం.
‑ మల్లేశ్, ప్రైవేట్ ఎంప్లాయ్