తెలుగు జర్నలిజం రంగంలో జీఎస్​ వరదాచారి కర్మయోగిగా నిలిచారు : వక్తలు

తెలుగు జర్నలిజం రంగంలో జీఎస్​ వరదాచారి కర్మయోగిగా నిలిచారు : వక్తలు

తెలుగు వర్సిటీలో జరిగిన సంతాప సభలో వక్తలు

హైదరాబాద్, వెలుగు: తెలుగు జర్నలిజం రంగంలో జీఎస్​ వరదాచారి కర్మయోగిగా నిలిచారని పలువురు వక్తలు కొనియాడారు. వరదాచారి ఐదు రోజుల కిందట కన్నుమూయగా... సంతాప సభను సోమవారం తెలుగు యూనివర్సిటీ జర్నలిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలువురు జర్నలిస్టులు ఆయన ఫొటోకు పూలమాలలు వేసి  నివాళులర్పించారు. చీఫ్ గెస్టుగా హాజరైన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. వరదా చారి పత్రికా రంగంలో ఉన్నత విలువలు, ప్రమాణాలను పాటిస్తూ ఆదర్శ గురువుగా నిలిచారన్నారు. ఆయన మరణం జర్నలిజం రంగానికి తీరని లోటన్నారు.

నిష్పాక్షికంగా ఉండే ఆయన రచనలు భవిష్యత్ జర్నలిస్టులకు ఉపయోగకరంగా నిలుస్తాయన్నారు. తెలుగు వర్సిటీ వీసీ తంగెడ కిషన్ రావు,  ప్రొఫెసర్లు కె. సుధీర్ కుమార్, సత్తిరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు కె. రామచంద్రమూర్తి, గోవిందరాజు చక్రధర్, ఎం. నాగేశ్వరరావు,  ఆర్వీ రామారావు, వల్లీశ్వర్, శంకర్ నారాయణ, పలువురు వక్తలు వరదాచారి సేవలను కొనియాడారు.  సంతాప సభలో ఆయన  కుమారుడు గోవర్ధన్, శ్రీ హర్ష, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.