- ప్రాసిక్యూషన్ పరిమితి రూ.5 కోట్లకు పెంపు
- శిక్షలు వేసే అధికారం న్యాయస్థానాలకే
- సాధారణ జరిమానా రూ.10 వేలకు తగ్గింపు
- 10 రోజుల్లోనే రీఫండ్లు.. పన్ను రేట్లు యథాతథం
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు వేధింపులు లేకుండా, వ్యాపార నిర్వహణ మరింత సులభతరం చేసే లక్ష్యంతో జీఎస్టీ కౌన్సిల్ పలు సంస్కరణలకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన గురువారం జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో డీక్రిమినలైజేషన్, వివాదాల పరిష్కారాన్ని వేగవంతం చేయడంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రస్తుత పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండానే, పరిపాలనాపరమైన, చట్టపరమైన సంస్కరణలపై కౌన్సిల్ ప్రత్యేక దృష్టి సారించింది. జీఎస్టీ చట్టంలో అధికారులకు ఉన్న ఏకపక్ష అరెస్టు అధికారాలను తొలగించాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఇకపై సాధారణ పన్ను వివాదాల్లో బలవంతపు అరెస్టులు ఉండవు. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో కూడా అరెస్టుకు న్యాయస్థానాల అనుమతి తప్పనిసరి కానుంది.
క్రిమినల్ ప్రాసిక్యూషన్ నమోదు చేసే కనీస పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచారు. దీంతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలపై క్రిమినల్ చర్యల భయం తప్పుతుంది. చట్టంలోని కనీస జైలు శిక్ష నిబంధనను ఎత్తివేసి, తుది శిక్ష లేదా జరిమానా ఖరారు చేసే పూర్తి విచక్షణను న్యాయస్థానాలకే వదిలేశారు. నిర్దిష్ట శిక్ష లేని సాధారణ తప్పిదాలకు విధించే జరిమానాను రూ.25 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించారు.
రూ.10 వేలలోపు బకాయిలకు నోటీసుల రద్దు
చిన్నపాటి సాంకేతిక తప్పిదాలతో వ్యాపారులు ఇబ్బంది పడకుండా వివాద పరిష్కారాల్లో ఏకరూపత తీసుకురానున్నారు. పన్ను బకాయి మొత్తం రూ.10 వేల లోపు ఉంటే అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయకూడదని స్పష్టం చేశారు. రిటర్నుల దాఖలులో ఆలస్యమైనా, గణాంకాల్లో పొరపాట్లు దొర్లినా పన్ను వసూలు, వడ్డీ, చట్టబద్ధమైన సాధారణ జరిమానాతోనే పరిష్కరిస్తారు తప్ప వ్యాపారులపై ఎటువంటి తీవ్రమైన, చట్టపరమైన చర్యలు ఉండవు.
జీఎస్టీ రీఫండ్ క్లెయిమ్ దరఖాస్తు పరిశీలన గడువును 15 రోజుల నుంచి 10 రోజులకు కుదించారు. నిర్ణీత 10 రోజుల్లో అధికారులు రశీదు లేదా అభ్యంతర పత్రం ఇవ్వకపోతే ఆ దరఖాస్తును ఆమోదించినట్లే (డీమ్డ్ అప్రూవల్) పరిగణిస్తారు. అధికారుల జోక్యం లేకుండా సాంకేతిక వ్యవస్థ ద్వారానే 90 శాతం క్లెయిమ్ మొత్తాన్ని 3 రోజుల్లో నేరుగా మంజూరు చేస్తారు. క్యాష్ లెడ్జర్‌లో మిగిలి ఉన్న అదనపు నిల్వలను ఆటోమేటిక్‌గా పన్ను చెల్లింపుదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
తనిఖీల్లో వేధింపులకు అడ్డుకట్ట
రాష్ట్రాల సరిహద్దుల్లో సరుకు రవాణా వాహనాల తనిఖీ విధానంలో పారదర్శకత తీసుకొచ్చారు. పక్కా నిఘా సమాచారం ఉంటే, జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి ముందస్తు రాతపూర్వక అనుమతితో మాత్రమే వాహనాన్ని ఆపాలి. సరుకు బయలుదేరిన రాష్ట్రం, అది చేరాల్సిన గమ్యస్థాన రాష్ట్రం మాత్రమే తనిఖీలు నిర్వహించాలి.
మార్గమధ్యంలో ఉండే ఇతర రాష్ట్రాలకు వాహనాన్ని అడ్డుకునే అధికారం ఉండదు. నెలకు రూ.2.5 లక్షల లోపు పన్ను చెల్లించే నూతన దరఖాస్తుదారులకు అధికారుల ప్రమేయం లేకుండానే 3 రోజుల్లో సిస్టమ్ ఆధారిత ఆటోమేటెడ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు.
సరైన ఇన్వాయిస్, సక్రమమైన బ్యాంకింగ్ లావాదేవీలతో సరుకు కొనుగోలు చేసినప్పటికీ, విక్రేత పన్ను ఎగవేస్తే అమాయక కొనుగోలుదారులు ఇబ్బంది పడకుండా (ఐటీసీ రక్షణ కోసం) అధికారుల కమిటీ 3 నెలల్లో అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. జీఎస్టీ కౌన్సిల్ చేసిన ఈ ప్రతిపాదనలు అమల్లోకి రావడానికి పార్లమెంట్‌లో కేంద్ర జీఎస్టీ చట్ట సవరణలు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీలలో రాష్ట్ర జీఎస్టీ చట్ట సవరణలు ఆమోదం పొందాల్సి ఉంటుంది. అనంతరం సంబంధిత నిబంధనలు అధికారిక నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి వస్తాయి.
