హైదరాబాద్, వెలుగు: జీఎస్టీ ఒక సైతాన్ అని.. మొత్తం ఖజానాను స్వాహా చేస్తున్నదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం సర్వనాశనమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ వల్ల రాష్ట్రానికి రూ.80 వేల కోట్ల వరకు నష్టం జరిగినట్టు అధికారులు చెబుతున్నారని.. వార్షిక నష్టాలే రూ.7 వేల కోట్లుగా ఉంటున్నాయని స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని అన్నారు.
జీఎస్టీ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతో బీజేపీ తీసుకొచ్చిన ఈ జీఎస్టీ వల్ల.. ఎక్కువ పన్నులు చెల్లించే రాష్ట్రాలకు తక్కువ రిటర్న్‌లు ఇస్తున్నదని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన డివొల్యూషన్ చేస్తున్నామంటూ చెబుతున్న కేంద్రం.. తక్కువ పన్ను వసూళ్లు జరుగుతున్న ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఎక్కువ నిధులను ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో రాష్ట్రంలో పన్ను వసూళ్లు రూ.1.04 లక్షల కోట్లుగా ఉండేదని.. కానీ, 2024–25 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.62,986.63 కోట్లే వచ్చాయన్నారు. పెట్రోల్, లిక్కర్‌కు మాత్రమే జీఎస్టీని వసూలు చేయడం లేదన్నారు. అయితే, పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలుపుతూ కేంద్రం మరింత లాభాలను పొందుతున్నదని చెప్పారు. ఇథనాల్ లీటర్ కేవలం రూ.40 ఉంటుందని, పెట్రోల్‌లో 20 శాతం దానినే కలుపుతున్నారని చెప్పారు. ఆ మేరకు కేంద్రం పెట్రోల్ ధరలను ఎందుకు తగ్గించడం లేదని మండిపడ్డారు.
విద్యే కాదు.. ఉపాధి అవకాశాలూ కల్పించాలి
ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి సంబంధించిన డిటెయిల్డ్రిపోర్టును పబ్లిక్కు అందుబాటులో పెట్టారా లేదా అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ఒవైసీ ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులకు ఎందుకు జాబ్స్రావడం లేదని ప్రశ్నించారు. సోమవారం ఆయన అసెంబ్లీలో తెలంగాణ యూనివర్సిటీల బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడారు. విద్యతోపాటు జాబ్స్అవకాశాలు కూడా సృష్టించాలన్నారు.
అందుకు తగ్గట్టుగా విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ట్రైనింగ్ ఇవ్వాలని కోరారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా కాలేజీలు, యూనివర్సిటీల్లో సైకియాట్రిక్ కౌన్సిలింగ్‌ను ఇచ్చే వింగ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీల్లోకి సప్లయ్ అవుతున్న డ్రగ్స్ ను కట్టడి చేసే చర్యలు తీసుకోవాలని కోరారు. డిగ్రీలోని బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులను అప్‌గ్రేడ్ చేయాలని చెప్పారు. కాగా, లండన్ ఎకనామిక్ స్కూల్ వంటి యూనివర్సిటీని ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలన్నారు.
