ఇవాళ్టి ( సెప్టెంబర్ 22 ) నుంచే కొత్త జీఎస్‌‌‌‌టీ... తగ్గనున్న 375 వస్తువుల ధరలు

ఇవాళ్టి ( సెప్టెంబర్ 22 ) నుంచే కొత్త జీఎస్‌‌‌‌టీ... తగ్గనున్న 375 వస్తువుల ధరలు
  • ఇప్పటికే ధరల తగ్గుదలను ప్రకటించిన చాలా కంపెనీలు 

న్యూఢిల్లీ:  కొత్త జీఎస్‌‌‌‌టీ రేట్లు అమలులోకి రావడంతో వంట సామాగ్రి నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, ఆటోమొబైల్‌‌‌‌ల వరకు ధరలు తగ్గనున్నాయి. జీఎస్‌‌‌‌టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో 375 వస్తువులపై పన్ను తగ్గింపు వర్తించనుంది. నెయ్యి, పన్నీర్, బటర్, నమ్‌కీన్, కెచప్‌‌‌‌, జామ్, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్‌‌‌‌క్రీమ్ వంటి నిత్యావసర వస్తువులు - చౌకగా లభించనున్నాయి. మందులు, గ్లూకోమీటర్లు, డయాగ్నస్టిక్ కిట్లపై జీఎస్‌‌‌‌టీ  5శాతానికి తగ్గడంతో ఆరోగ్య సేవలు మరింత తక్కువ ధరకు  అందుబాటులోకి వస్తాయి. 

సిమెంట్‌‌‌‌పై జీఎస్‌‌‌‌టీ 28శాతం నుంచి 18శాతానికి తగ్గించడంతో గృహ నిర్మాణ వ్యయం తగ్గుతుంది. చిన్న, పెద్ద కార్లపై 18శాతం జీఎస్‌‌‌‌టీ వర్తించనుండగా, కార్ల కంపెనీలు ఇప్పటికే ధరలు తగ్గించాయి. బ్యూటిఫికేషన్‌‌‌‌ సేవలు, యోగా, జిమ్, సెలూన్‌‌‌‌లపై జీఎస్‌‌‌‌టీ 18శాతం నుంచి 5శాతానికి తగ్గింది. హెయిర్ ఆయిల్, సబ్బులు, షాంపూలు, టూత్‌‌‌‌పేస్ట్, షేవింగ్ క్రీమ్ వంటి వస్తువులపై కూడా ధరలు తగ్గనున్నాయి. 

కొత్త విధానం ప్రకారం, ఎక్కువ భాగం వస్తువులు 5శాతం లేదా 18శాతం జీఎస్‌‌‌‌టీకు లోబడి ఉంటాయి. అల్ట్రా లగ్జరీ,  టొబాకో, సంబంధిత వస్తువులపై 40 శాతం పడుతుంది. కాగా, కొత్త జీఎస్‌‌‌‌టీ రేట్లలో భాగంగా 12శాతం స్లాబ్‌‌‌‌లో ఉన్న 99శాతం వస్తువులు 5శాతానికి, 28శాతం స్లాబ్‌‌‌‌లో  ఉన్న 90శాతం వస్తువులు 18శాతానికి మారనున్నాయి.

ధరలు తగ్గించిన కంపెనీలు

టీవీ తయారీ కంపెనీలు రూ.2,500 నుంచి రూ.85 వేల వరకు ధరలు తగ్గించాయి. సెప్టెంబర్ 22 నుంచి 32 అంగుళాలకంటే ఎక్కువ స్క్రీన్ ఉన్న టీవీలపై జీఎస్‌‌‌‌టీ 28శాతం నుంచి 18శాతానికి తగ్గనుంది. సోని, ఎల్‌‌‌‌జీ, పానాసోనిక్‌‌‌‌ వంటి కంపెనీలు కొత్త ధరల జాబితాను విడుదల చేశాయి. 

మారుతి సుజుకి, టాటా మోటార్స్‌‌‌‌, హ్యుందాయ్‌‌‌‌, మహీంద్రా, హోండా, కియా, టయోట  వంటి బండ్ల తయారీ కంపెనీలు ఇప్పటికే  రూ.1.29 లక్షల నుంచి రూ.4.48 లక్షల వరకు తమ కార్ల ధరలు తగ్గించాయి. మారుతి  చిన్న కార్లపై జీఎస్‌‌‌‌టీ తగ్గింపునకు అదనంగా, ప్రత్యేక తగ్గింపులు ప్రకటించింది. లగ్జరీ బ్రాండ్లు మెర్సిడెస్ బెంజ్‌‌‌‌, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వర్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్ రోవర్‌‌‌‌‌‌‌‌ తమ కార్లపై  రూ.10–రూ.30 లక్షల వరకు ధరలు తగ్గించాయి. టూవీలర్  వాహనాల్లో హీరో, హోండా రూ.15,743–రూ.18,800 వరకు తగ్గింపు ప్రకటించాయి.

    
రూ.7,500 లేదా అంతకంటే తక్కువ ధర ఉన్న హోటల్ గదులు ఒక్క రాత్రికి రూ.525 వరకు చౌకగా లభించనున్నాయి. జీఎస్‌‌‌‌టీ రేటు 12శాతం నుంచి 5శాతానికి తగ్గడంతో  ఈ ప్రయోజనం అందనుంది. 
    
జీఎస్‌‌‌‌టీ రేట్లు తగ్గనుండడంతో హోమ్ అప్లయెన్సెస్ కంపెనీలు  ఏసీలు, డిష్‌‌‌‌వాషర్‌‌‌‌‌‌‌‌లపై ధరలను తగ్గించాయి.  రూమ్‌‌‌‌  ఎయిర్ కండిషనర్ల (ఏసీల) ధరలు రూ.4,500 వరకు, డిష్‌‌‌‌వాషర్‌‌‌‌ల ధరలు రూ.8 వేల వరకు దిగొస్తాయి.