అర్హులకే గ్యారంటీలు అందాలి :సీనియర్ జర్నలిస్ట్ కూర సంతోష్

అర్హులకే గ్యారంటీలు అందాలి :సీనియర్ జర్నలిస్ట్ కూర సంతోష్

ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత అని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొలువుదీరింది.  పదేండ్ల  బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా  కాంగ్రెస్ నేతలు విభేదాలు వీడి ఒక్కటయ్యారు. గెలిచారు.  సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు రివ్యూలు నిర్వహిస్తూ శాఖలపై పట్టు సాధిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో రెండు శ్వేతపత్రాలు విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, విద్యుత్ రంగ తీరును ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా వినిపించారు. మరోవైపు 6 గ్యారంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలుజేస్తున్నారు.

ఆర్టీసీ కార్డు ప్రవేశపెట్టాలి

హైదరాబాద్​లో  ట్రాఫిక్, పొల్యూషన్ తగ్గిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో చిన్నచిన్న పనులకు బండ్లు తీసేవారని, ఇప్పుడు బస్సుల్లో వెళ్తున్నారని చెబుతున్నారు. పబ్లిక్ రవాణా పెరగడంతో జాతీయ రహదారులపై ప్రమాదాలు తగ్గాయన్న వాదన వినిపిస్తోంది.  మరోవైపు ఫ్రీ జర్నీతో తమ పొట్టగొట్టారని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. అయితే ఫ్రీ జర్నీపై నెగెటివ్ కాకుండా పాజిటివ్ వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం ఆధార్ కార్డ్ చూపిస్తే ఫ్రీ జర్నీకి అనుమతి ఇస్తున్నారు. పేదలకు మాత్రమే పరిమితం చేస్తూ  ఆర్టీసీ కార్డు ద్వారా ప్రయాణానికి పర్మిషన్ ఇవ్వాలి. ఆర్టీసీ కార్డు తీసుకోవడానికి కొన్ని కండిషన్లు పెట్టాలి. దీని ద్వారా నిజమైన పేద మహిళలు మాత్రమే ఫ్రీ జర్నీ చేయగలుగుతారు. దాంతో ఆర్టీసీపై భారం తగ్గుతుంది.

కత్తి మీద సాము

పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చాలా క్లిష్టమైనది. అర్హులకే పథకాలంటూ విపరీతంగా కోతలు పెడితే కష్టం. ప్రజల నుంచి వ్యతిరేకత రావొచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ రోజులు ఉండదంటూ బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని స్పష్టంగా ప్రకటించినా రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచే హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మహాలక్ష్మి గ్యారంటీలో మరో రెండు అంశాలు ఉన్నాయి. మహిళలకు ప్రతి నెలా 2,500 రూపాయలు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు. రైతు భరోసా, గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు,  యువ వికాసం, చేయూత ద్వారా 4 వేల నెలవారీ పెన్షన్లు వంటివి కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల్లో భాగం. ప్రజాపాలన ద్వారా 6 గ్యారంటీలకు దరఖాస్తుల స్వీకరణ ఒక మంచి ప్రక్రియ.

రేవంత్ మార్క్ పాలన

 హామీల అమలుకు భారీ నిధులు కావాలని కాంగ్రెస్ నేతలకు తెలుసు. అయితే, ప్రజలు కేసీఆర్ ను ఖచ్చితంగా గద్దె దించాలన్న కసితో పాటు 6 గ్యారంటీలను నమ్మి కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి 6 గ్యారంటీల అమలు విషమ పరీక్షే. రాష్ర్ట ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు తెలుసు కాబట్టి ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పాలనపై తన మార్క్ ఉండేలా చూసుకుంటున్నారు. సీఎంగా ప్రమాణం చేస్తున్నప్పుడే ప్రగతిభవన్ ముందు ఉన్న కంచె తొలగింపజేశారు. గతంలో ప్రగతి భవన్ లోకి సామాన్యులకే కాదు ఎమ్మెల్యేలు, మంత్రులకే అనుమతి ఉండేది కాదు. కానీ, రేవంత్ ప్రజావాణి ద్వారా ప్రగతి భవన్ లో ఎంట్రీ కల్పించారు. వారంలో రెండు రోజులు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు స్వీకరించడానికి స్పెషల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.  అర్హులకు మాత్రమే గ్యారంటీలు అందితే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుంది.  రైతు భరోసా పథకం కూడా దుర్వినియోగం కాకుండా చూడాలి. గతంలో రైతుబంధు పదుల సంఖ్యలో ఎకరాలు ఉన్నవారికి వచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అసలైన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వడం అంత పెద్ద సమస్య కాదు. ఇక సిలిండర్ 500 రూపాయలకే పథకం కూడా దుర్వినియోగం కాకుండా చూడాలి. అలాగే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ పథకం కూడా అర్హులకే అందించాలి. సంక్షేమ పథకాలను అర్హులకు అందించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.

- కూర సంతోష్,
సీనియర్ జర్నలిస్ట్