- గోనె సంచులు ఇవ్వాలని రోడ్డుపై ధర్నా
- టోకెన్లలో చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణ
గూడూరు, వెలుగు: మొక్కజొన్న కొనుగోళ్లు జాప్యం కావడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా గురువారం మహబూబాబాద్ జిల్లా గూడూరులో సిబ్బందిని లోపే ఉంచి సొసైటీ కార్యాలయానికి తాళం వేశారు. అనంతరం నేషనల్ హైవేపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొక్కజొన్నను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 20 రోజులు అవుతున్నా అధికారులు కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం పరిశీలించిన తర్వాత కూడా గోనె సంచులు ఇవ్వకుండా సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.
పైసలు ఇచ్చిన వారికి, పైరవీ చేసిన వారికి సంచులు వెంటనే ఇస్తున్నారని ఆరోపించారు. మాయిశ్చర్ చూసిన తర్వాత కూడా మళ్లీ చూడాలని చెబుతూ టోకెన్లు ఇవ్వకుండా రోజులు గడుపుతున్నారని మండిపడ్డారు. ఎండా, వానా తేడా లేకుండా రాత్రింబవళ్లు జొన్నల వద్ద కాపలా కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో యూరియా బస్తాల కోసం ధర్నాలు చేయాల్సి వచ్చిందని, ఇప్పుడు మొక్కజొన్న గోనె సంచుల కోసం ఆందోళన చేయాల్సి రావడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గోనె సంచులు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై గిరిధర్ రెడ్డి రైతులతో మాట్లాడి సంచులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

