లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నగర పంచాయతీ కమిషనర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నగర పంచాయతీ కమిషనర్

కర్నూలు: గూడూరు నగర పంచాయతీ కమిషనర్ బి.ప్రహ్లాద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. స్థానికంగా ఓ చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్న శ్రీను అనే వ్యక్తి నుండి రూ.10 వేలు లంచం తీసుకుని హడావుడిగా కారెక్కి వెళ్లిపోతుంటే.. ఏపీబీ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. శనివారం సాయంత్రం జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. లాక్ డౌన్ కు ముందు ఏసీబీ అధికారులకు తాహశీల్దార్ హసీనా బేగం పట్టుబడిన ఉదంతం మరచిపోక ముందే మరో ఏసీబీ కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది.

హోటల్ శ్రీను నడుపుకుంటున్న టిఫిన్ సెంటర్ చుట్టు పక్కల వారికి ఇబ్బందికరంగా ఉందన్న ఫిర్యాదుతో కమిషనర్ ప్రహ్లాద్ దాడి చేసి అతని హోటల్ సామగ్రి నంతా ఎత్తుకెళ్లి మున్సిపల్ కార్యాలయంలో పెట్టించారు. దీనిపై బాధితుడు హైకోర్టుకు వెళ్లగా.. అతని సామాన్లు ఇచ్చేయమని ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఆదేశించినా కమిషనర్ పట్టించుకోలేదు. సామాన్లు ఇవ్వకుండా తిప్పుకునేవాడు. ఒకరోజు గట్టిగా నిలదీస్తే..  నీవల్ల నాకు కోర్టుకు వెళ్లి రావడానికి రూ.22,500 ఖర్చు అయింది.. నా కోర్టు ఖర్చులు ఇస్తేనే నీ సామాన్లు ఇస్తానని చెప్పడంతో బాధితుడు తిన్నగా వెళ్లి ఏసీబీ అధికారులకు తన గోడు వెళ్లబోసుకున్నాడు. కర్నూలులో ఏసీబీ అధికారులిచ్చిన రూ.10 వేల నగదు తీసుకుని కవర్లో పెట్టుకుని గూడూరుకు వచ్చాడు.  మున్సిపల్ కమిషనర్ ను ఎప్పుడు కలవమంటారని చెప్పగా.. వెంటనే వచ్చేయమని చెప్పడంతో బాధితుడు శ్రీను వెళ్లి నగర పంచాయతీ ఆఫీసుకు వెళ్లాడు. లంచం డబ్బు తీసుకుని వెంటనే కారెక్కి కర్నూలుకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. పక్కనే మాటు వేసిన ఏసీబీ అధికారులు వెంబడించారు. ఏబీఎం చర్చి వద్ద అడ్డుకుని తాము ఏసీబీ అధికారులమని చెప్పగా.. వారిని తోసేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఏసీబీ అధికారులు సిబ్బంది వెంబడించి పట్టుకుని కారులోమున్సిపల్ ఆఫీసుకు తీసుకుని వచ్చారు. ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి ఆధ్వర్యంలో కమిషనర్ తీసుకున్న లంచం డబ్బును కెమికల్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. లంచం తీసుకున్నట్లు నిర్ధారించుకున్న ఏసీబీ అధికారులు.. నగర పంచాయతీ సిబ్బందితో కమిషనర్ గురించి ఆరా తీశారు. డైలీ వర్కర్ల నుండి.. స్వీపర్ల నుండి కూడా ఉద్యోగాలిస్తానని లంచం తీసుకున్నట్లు వారు చెప్పడంతో వారి ఫిర్యాదులు తీసుకున్నారు. కర్నూలు నగరంలోని ఏ.క్యాంప్ లో ఉన్న బీకే సింగ్ అపార్టుమెంట్లో కమిషనర్ ఇంటికి మరో సిబ్బంది వెళ్లి తనిఖీలు చేయగా..  14 తులాల బంగారం ఆభరణాలు, రూ.38 వేల నగదు దొరికింది. ఈ సొమ్ముకు ఆధారాలు లేకపోవడంతో ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.