ఉద్యోగ భద్రతపై గైడ్‌‌‌‌లైన్స్ విడుదల చేయాలి: ఆర్టీసీ జేఏసీ

ఉద్యోగ భద్రతపై గైడ్‌‌‌‌లైన్స్ విడుదల చేయాలి: ఆర్టీసీ జేఏసీ

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీలు, డీఏ లతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి, కన్వీనర్ హనుమంతు ముదిరాజ్ కోరారు. సీసీఎస్ బకాయిలు, పీఎఫ్ ట్రస్ట్ బకాయిలు, బ్యాంక్ గ్యారంటీ అప్పులు, ఉద్యోగ భద్రత ఇవ్వాలన్నారు. ఇవి ఇస్తే మూడేండ్లలో లాభాల బాటలోకి వస్తుందన్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇవ్వాలన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్​లో విలీన బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఫ్లోర్ లీడర్లు, మంత్రులకు.. చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ కు థ్యాంక్స్​ తెలిపారు. త్వరలో సీఎం కేసీఆర్ ను కలుస్తామన్నారు. సోమవారం బస్ భవన్ దగ్గర నేతలు మీడియాతో మాట్లాడారు. డ్రాఫ్ట్ బిల్లులో సవరణలు సూచించినందుకు గవర్నర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు అశ్వత్థామరెడ్డి తెలిపారు. 

“ఆర్టీసీ ఉన్నంత వరకు గవర్నర్ తమిళిసై అమ్మను మర్చిపోలేం. త్వరలో గవర్నర్ కు సన్మానం చేస్తం. డ్రాఫ్ట్ లో సవరణలు సూచించినందుకు వేల మంది కార్మికులం రుణపడి ఉంటం. కార్మికుల పక్షాన ఆలోచించి బకాయిలు, ఉద్యోగ భద్రత, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఆస్తులు, అప్పుల గురించి అడిగారు. బిల్లు ఆమోదం టైమ్ లో సవరణలు సూచించారు” అని ఆయన అన్నారు. కారుణ్య నియమాకాల కింద ఉద్యోగాల్లోకి తీసుకున్న వారిని రెగ్యులర్ చేయాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ.. బ్రెడ్ విన్నర్ స్కీమ్ లో డ్యూటీలో చనిపోయిన ఉద్యోగుల పిల్లలు అందరికీ రెగ్యులర్ ప్రాతిపదికన డ్యూటీలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిన సందర్భంగా సోమవారం జేఏసీ నేతలు ఎండీ సజ్జనార్ ను, ఆర్టీసీ అధికారులను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

చైర్మన్‌‌‌‌ను కలిసి కృతజ్ఞతలు

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదం సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ను కలిసి టీఎంయూ నేతలు థామస్ రెడ్డి, యాదయ్య, కమలాకర్ గౌడ్, ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి తదితరులు సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. విలీనంతో వేల మంది కార్మికులకు సీఎం కేసీఆర్ మేలు చేశారన్నారు. ఆర్టీసీకి, కార్మికులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేశానని, విలీనంలో తన పాత్ర ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని గోవర్ధన్ అన్నారు.