పడవ బోల్తాపడి 12 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు మృతి

పడవ బోల్తాపడి 12  మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు మృతి

గుజరాత్‌లోని వడోదరలోని హర్ని సరస్సులో పడవ బోల్తా పడి 12 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగినప్పుడు పడవలో 23 మంది పిల్లలు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రెస్క్యూ టీమ్ సరస్సు నుండి ఐదుగురు పిల్లలను రక్షించింది.

బాధితులకు ఎక్స్ గ్రేషియా

వడోదరలోని హర్ని సరస్సు వద్ద పడవ బోల్తా పడటం వల్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉందని ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని, స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తోందని చెప్పారు. మరణించిన ప్రతి కుటుంబానికి పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుందని, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఇవ్వబడుతుందని పీఎంఓ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

సీఎం భూపేంద్ర పటేల్ సంతాపం

వడోదరలోని హర్ని సరస్సులో పడవ బోల్తా పడి చిన్నారులు మృతి చెందడం చాలా బాధాకరమని, ప్రాణాలు కోల్పోయిన అమాయక చిన్నారుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు. ఈ విషాద సమయంలో ఆయన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రస్తుతం బోటులో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందని, ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందించి చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్టు ముఖ్యమంత్రి X లో పోస్ట్ చేశారు.