కులాంతర ప్రేమను అంగీకరించలేక ఓ తండ్రి కన్నకూతురినే హత్య చేసిన ఘటన గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో కలకలం రేపింది. ఖంభాట్ తాలూకా మెట్పూర్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల సానియా పటేల్‌ను ఆమె తండ్రి కౌశల్‌కుమార్ పటేల్ గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. సానియా కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసి పీజీ చేస్తోంది. ఆమె అదే ప్రాంతానికి చెందిన వేరే కులానికి చెందిన యువకుడిని ఏడాదిగా ప్రేమిస్తోంది. అయితే ఈ సంబంధాన్ని తండ్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. కులం ఒక్కటే కాకుండా, ఆ యువకుడి సంపాదన తక్కువగా ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
నవంబర్ 9 తెల్లవారుజామున ప్రేమ వ్యవహారంపై తండ్రి, కూతురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన తండ్రి చున్నీతో గొంతు బిగించి సానియాను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆమె మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. పోస్టుమార్టంలో గొంతు నులిమి చంపినట్లు నిర్ధారణ అయింది. పోలీసుల విచారణలో తండ్రి నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు సానియా తండ్రిని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు.
