ఇస్రో సైంటిస్టు అంటూ చీటింగ్.. ప‌ట్టుకుని జైల్లో వేసిన పోలీసులు

ఇస్రో సైంటిస్టు అంటూ చీటింగ్.. ప‌ట్టుకుని జైల్లో వేసిన పోలీసులు

చంద్రయాన్-3 మిషన్‌లో పాల్గొన్న ఇస్రో శాస్త్రవేత్తగా చెప్పుకుంటున్న మితుల్ త్రివేది అనే వ్యక్తిని గుజరాత్‌లోని సూరత్‌లో ఆగస్టు 29న అరెస్టు చేశారు. త్రివేది ఒక ప్రైవేట్ ట్యూటర్. తన వద్దకు ట్యూషన్ తరగతులకు ఎక్కువ మంది రావాలనే ఉద్దేశంతో ఇస్రో శాస్త్రవేత్తనని చెప్పుకున్నాడు. అంతే కాదు అది నిజమేనని చెప్పేందుకు నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్‌లు, సర్టిఫికేట్‌లను సైతం తయారు చేశాడు.

ఆగస్టు 23న చంద్రునిపై చంద్రయాన్‌-3 విజయవంతంగా ల్యాండ్‌ అయిన తర్వాత త్రివేది మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారని, తాను ఇస్రో ‘ఆసియన్‌ సైన్స్‌ అప్లికేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌’కు ‘వైస్‌ ఛైర్మన్‌’నని, తానే మిషన్ కోసం ల్యాండర్ మాడ్యూల్ డిజైన్‌ చేశానని పోలీసులు తెలిపారు. "ఆ వ్యక్తి ఇస్రో చేపట్టిన చంద్రయాన్ -3 మిషన్‌తో ఎలాంటి సంబంధం లేదని, ఇస్రో ఉద్యోగి అని తప్పుడు వాదనలు చేశాడని సమగ్ర దర్యాప్తులో తేలింది" అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ALSO READ :కాస్త వెరైటీగా.. ఐస్ క్రీమ్ లతో రక్షా బంధన్

త్రివేది ప్రైవేట్ ట్యూటర్ అని, తన ట్యూషన్ తరగతులకు ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షించడానికి మీడియా ముందు ఇస్రో శాస్త్రవేత్తగా పోజులిచ్చాడని అదనపు పోలీసు కమిషనర్ శరద్ సింఘాల్ చెప్పారు. "ఈ విషయంపై మేము ISROని సంప్రదించాము, నిందితుడు చూపిన లేఖను తాము జారీ చేయలేదని వారు చెప్పారు. అంతరిక్ష సంస్థ మాకు త్వరలో వివరణాత్మక సమాధానం పంపుతుంది" అని ఆయన అన్నారు. త్రివేదికి ఇస్రోతో ఎలాంటి సంబంధం లేదని, చంద్రయాన్-3 మిషన్‌లో ఎప్పుడూ పని చేయలేదని పోలీసుల విచారణలో తేలింది. అనంతరం పోలీసులు అతన్ని అరెస్టు చేసి మోసం, వంచన అభియోగాలు కింద కేసులు నమోదు చేశారు. సూరత్ సిటీ క్రైమ్ బ్రాంచ్ నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 419 (మోసం చేయడం), 465 (ఫోర్జరీ), 468 (మోసం కోసం ఫోర్జరీ చేయడం), 471 (నకిలీ పత్రాలను సృష్టించడం, వినియోగించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.