గుజరాత్ టైటాన్స్కు మరో విక్టరీ..భారీ తేడాతో..

గుజరాత్ టైటాన్స్కు మరో విక్టరీ..భారీ తేడాతో..

 ఐపీఎల్‌ 2023లో గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో ఏకంగా 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. 228 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో..20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులకే పరిమితమైంది. 

228 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఓపెనర్లు కైల్ మేయర్స్, డికాక్ ఇద్దరు అద్భుతంగా ఆడారు. వీరిద్దరు తొలి వికెట్ కు కేవలం 8.2 ఓవర్లలోనే 88 పరుగులు జోడించారు. 48 పరుగులు చేసిన మేయర్స్ మోహిత్ శర్మ బౌలింగ్ లో వెనుదిరిగాడు. వన్ డౌన్ లో వచ్చిన దీపక్ హుడా 11 పరుగులే చేసి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత లక్నో వరుసగా వికెట్లను కోల్పోయింది. 

డికాక్ పోరాటం..

ఓ వైపు వికెట్లు పడుతున్నా..డికాండ్ చెలరేగి ఆడాడు. గుజరాత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అర్థ సెంచరీ చేశాడు. కేవలం 41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు సాధించాడు. అయితే ధాటిగా ఆడుతున్న  డికాక్ ను రషీద్ ఖాన్ ఔట్ చేశాడు. దీంతో లక్నో 140 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. చివర్లో ఆయుష్ బదోని బ్యాట్ ఝుళిపించినా..అప్పటికే లక్ష్యం పెద్దదైంది. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 4 వికెట్లు తీసుకోగా.. షమీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు  టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్..స్టార్టింగ్ నుంచే లక్నో బౌలర్లపై విరుచుకుపడింది. ముఖ్యంగా వృద్ధిమాన్ సాహా చిచ్చరపిడుగుల చెలరేగాడు. మోదీ స్టేడియంలో సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. కేవలం 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన సాహా..ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. ఇతనికి గిల్ కూడా సహకారం అందించడంతో...గుజరాత్  వికెట్ నష్టపోకుండా 145 పరుగులు చేసింది. అయితే ఈ క్రమంలో 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 81 పరుగులు చేసిన సాహా ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 

గిల్ సునామీ..

సాహా ఔటయ్యాక గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 31 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన గిల్..ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. ఇతనికి కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహకారం అందించడంతో గుజరాత్ 14 ఓవర్లలోనే 150 పరుగులు క్రాస్ చేసింది. ఆ తర్వాత కూడా వీరిద్దరు పోటీ పడి మరీ పరుగులు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్ కు 39 పరుగులు జోడించారు. అయితే ఈ క్రమంలో 25 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా మోసిన్ ఖాన్ బౌలింగ్ లో పెవీలియన్ చేరాడు. పాండ్యా ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మిల్లర్ కూడా చెలరేగి ఆడాడు. అటు గిల్, ఇటు మిల్లర్ ఇద్దరూ..ఎడా పెడా బౌండరీలు ..సిక్సులు బాదడంతో గుజరాత్ చివరకు 20 ఓవర్లలో 2 వికెట్లకు 227 పరుగులు సాధించింది. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.