శివమెత్తిన శుభ్ మన్...ఉత్కంఠ పోరులో గుజరాత్ గెలుపు

శివమెత్తిన శుభ్ మన్...ఉత్కంఠ పోరులో గుజరాత్ గెలుపు

పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 154 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హార్దిక్ సేన..19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.  ఓపెనర్ శుభ్ మన్ అద్భుత హాఫ్ సెంచరీతో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. 

154 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ కు ఓపెనర్లు అద్బుతమైన ఆరంభాన్నిచ్చారు. వృద్ధిమాన్ సాహ, శుభ్ మన్ గిల్ తొలి వికెట్ కు 48 పరుగులు జోడించారు. అయితే 30 పరుగులు చేసిన సాహాను రబడా పెవీలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ 19 పరుగులే చేసి ఔటయ్యాడు. కొద్దిసేపటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా 8 పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో గుజరాత్ 106 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

చెలరేగిన శుభ్ మన్...

ఈ సమయంలో శుభ్ మన్ గిల్ జట్టును ఆదుకున్నాడు. డేవిడ్ మిల్లర్ తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇదే క్రమంలో 48 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో 67 పరుగులు చేశాడు. అటు మిల్లర్ 11 బంతుల్లో 1 ఫోర్ తో 15 పరుగులు చేసి అతనికి సహకరించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, రబడా, హర్ ప్రీత్ బ్రార్, సామ్ కర్రన్ తలో వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8వికెట్లకు 153 పరుగులే చేసింది. బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఖాతో ఓపెన్ కాకముందే తొలి వికెట్ కోల్పోయింది.  ప్రభ్ సిమ్రాన్ సింగ్ ను షమీ డకౌట్ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ ధావన్ (8) రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మాట్ షార్ట్(36), బానుక రాజపక్స(20) జట్టును ఆదుకున్నారు. ముఖ్య మాట్ షార్ట్ 24 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సుతో చెలరేగాడు. అయితే మాట్ షార్ట్ (36)ను రషీద్ ఖాన్ పెవలియన్ చేర్చాడు. దీంతో పంజాబ్ 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 

జితేష్ శర్మ పోరాటం..

రాజపక్సకు జతకలిసిన జితేష్ శర్మ..బ్యాట్ ఝుళిపించాడు. వీరిద్దరు నాల్గో వికెట్ కు 36 పరుగులు జత చేశారు. అయితే 25 పరుగులు చేసిన జితేష్ శర్మ మోహిత్ శర్మ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సామ్ కర్రన్ (22), షారుక్ ఖాన్ (22) పరుగులతో రాణించడంతో పంజాబ్ మోస్తరు స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 2 వికెట్లు దక్కించుకున్నాడు. షమీ, జాషువా లిటిల్, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్ తలా ఓ వికెట్ పడగొట్టారు.