GT vs MI Eliminator: బ్యాటింగ్‌లో శివాలెత్తిన ముంబై.. గుజరాత్ ఎలిమినేట్ ఖాయమేనా..

GT vs MI Eliminator: బ్యాటింగ్‌లో శివాలెత్తిన ముంబై.. గుజరాత్ ఎలిమినేట్ ఖాయమేనా..

ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లో చెలరేగి ఆడింది. శుక్రవారం (మే 30) గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో దుమ్ములేపి భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(50 బంతుల్లో 81:9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు సూర్య కుమార్ యాదవ్(33), బెయిర్ స్టో (47) పవర్ ప్లే లో మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (81) టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్,ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ కు ఒక వికెట్ దక్కింది.    

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. తొలి మూడు ఓవర్లలోనే 28 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. ప్రసిద్ కృష్ణ వేసిన నాలుగో ఓవర్లో బెయిర్ స్టో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఈ ఓవర్ లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లో రోహిత్ 14 పరుగులు బాదడంతో పవర్ ప్లే లో ముంబై 79 పరుగులు రాబట్టుకుంది. పవర్ ప్లే తర్వాత ప్రమాదకరంగా మారుతున్న బెయిర్ స్టో (47) వికెట్ తీసుకోవడంతో గుజరాత్ కు బిగ్ రిలీఫ్ లభించింది. 

►ALSO READ | GT vs MI Eliminator: క్యాచ్ ఒక్కరికి క్రెడిట్ మరొకరికి: సుదర్శన్, కొయెట్జ్ స్టన్నింగ్ ఎఫర్ట్

ఈ దశలో సూర్యతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. వికెట్ పడినప్పటికీ స్కోర్ వేగం తగ్గలేదు. వీరిద్దరూ రెండో వికెట్ కు 59 పరుగులు జోడించి భారీ స్కోర్ కు బాటలు వేశారు. సూర్య 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ కావడంతో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. అద్భుతమైన ఇన్నింగ్స్ తో 50 బంతుల్లో 81 పరుగులు చేసిన రోహిత్ ఆ కాసేపటికే ఔటయ్యాడు. ఉన్నంత సేపు సిక్సర్లతో హోరెత్తించిన తిలక్ వర్మతో పాటు చివర్లో హార్దిక్ పాండ్య (9 బంతుల్లో 22)  హిట్టింగ్ చేయడంతో ముంబై 228 పరుగులకు చేరుకుంది.