గిల్ దంచాడు..సాహా ఉతికాడు..మోదీ స్టేడియంలో గుజరాత్ భారీ స్కోరు

గిల్ దంచాడు..సాహా ఉతికాడు..మోదీ స్టేడియంలో గుజరాత్ భారీ స్కోరు

గుజరాత్ టైటాన్స్ దుమ్ము రేపింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ..భారీ స్కోరు సాధించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 227 పరుగుల భారీ స్కోరు చేసింది. 

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్..స్టార్టింగ్ నుంచే లక్నో బౌలర్లపై విరుచుకుపడింది. ముఖ్యంగా వృద్ధిమాన్ సాహా చిచ్చరపిడుగుల చెలరేగాడు. మోదీ స్టేడియంలో సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. కేవలం 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన సాహా..ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. ఇతనికి గిల్ కూడా సహకారం అందించడంతో...గుజరాత్  వికెట్ నష్టపోకుండా 145 పరుగులు చేసింది. అయితే ఈ క్రమంలో 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 81 పరుగులు చేసిన సాహా ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 

గిల్ సునామీ..

సాహా ఔటయ్యాక గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 31 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన గిల్..ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. ఇతనికి కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహకారం అందించడంతో గుజరాత్ 14 ఓవర్లలోనే 150 పరుగులు క్రాస్ చేసింది. ఆ తర్వాత కూడా వీరిద్దరు పోటీ పడి మరీ పరుగులు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్ కు 39 పరుగులు జోడించారు. అయితే ఈ క్రమంలో 25 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా మోసిన్ ఖాన్ బౌలింగ్ లో పెవీలియన్ చేరాడు. పాండ్యా ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మిల్లర్ కూడా చెలరేగి ఆడాడు. అటు గిల్, ఇటు మిల్లర్ ఇద్దరూ..ఎడా పెడా బౌండరీలు ..సిక్సులు బాదడంతో గుజరాత్ చివరకు 20 ఓవర్లలో 2 వికెట్లకు 227 పరుగులు సాధించింది. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.