అహ్మదాబాద్: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్‌లో ఐదో విక్టరీని ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ (34 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 56), డేవిడ్ మిల్లర్ (22 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46), అభినవ్ మనోహర్ (30 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) దంచికొడితే, స్పిన్నర్ నూర్ అహ్మద్ (3/37) మ్యాజిక్ చేయడంతో.. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో జీటీ 55 రన్స్ తేడాతో బలమైన ముంబైకి చెక్ పెట్టింది. తొలుత గుజరాత్ 20 ఓవర్లలో 207/6 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో ముంబై 20 ఓవర్లలో 152/9 స్కోరుకే పరిమితమైంది. నేహల్ వదేరా (21 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), కామెరూన్ గ్రీన్ (33) టాప్ స్కోరర్లు. అభినవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్పిన్ దెబ్బకు ముంబై ఢమాల్
టార్గెట్ ఛేజింగ్‌లో ముంబై మెగా లైనప్ జీటీ స్పిన్నర్లు నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ (2/27) స్పిన్ మ్యాజిక్‌కు బొక్కబోర్లా పడింది. పాండ్యా వేసిన రెండో ఓవర్లో కెప్టెన్ రోహిత్ (2) ఔట్‌తో మొదలైన వికెట్ల పతనం చివరి వరకు సాగింది. పవర్‌ప్లేలో ముంబై 29/1 స్కోరే చేయడంతో రన్స్ వేటలో వెనకబడిపోయింది. ఇది చాలదన్నట్లు 8వ ఓవర్‌లో రషీద్ మూడు బాల్స్ తేడాలో ఇషాన్ (13), తిలక్ వర్మ (2)ను పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో గ్రీన్, సూర్యకుమార్ (23) కాసేపు పోరాడారు. అయితే లెఫ్టార్మ్ స్పిన్నర్ నూర్ తన వరుస ఓవర్లలో ఈ ఇద్దరితో పాటు టిమ్ డేవిడ్ (0)ను కూడా ఔట్ చేయడంతో ముంబై 90/6తో ఎదురీత మొదలుపెట్టింది.చివర్లో నేహల్, చావ్లా (18), అర్జున్ టెండూల్కర్ (13) పోరాటం ముంబై ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. మోహిత్ 2, హార్దిక్ ఒక వికెట్ తీశారు.
జీటీ ధనాధన్
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాహా (4), హార్దిక్ పాండ్యా (13), విజయ్ శంకర్ (19) మినహాయిస్తే తర్వాత వచ్చిన ప్రతీ ఒక్కరు ముంబై బౌలింగ్‌ను ఉతికి ఆరేశారు. అయితే మూడో ఓవర్‌లో అర్జున్ టెండూల్కర్ (1/9) సాహాను ఔట్ చేసి ఇచ్చిన బ్రేక్‌ను మిగతా బౌలర్లు అందుకోలేకపోయారు. ఓ ఎండ్‌లో గిల్ నిలకడగా ఫోర్లు, సిక్సర్లతో పాండ్యాతో సెకండ్ వికెట్‌కు 38 రన్స్ జోడించాడు. తర్వాత వచ్చిన విజయ్ శంకర్ పదో ఓవర్‌లో 4, 6 బాదితే, గిల్ ఫోర్‌తో 30 బాల్స్‌లో హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. దీంతో జీటీ సగం ఓవర్లకు 84/2తో నిలిచింది. ఈ దశలో స్పిన్నర్లు కార్తికేయ (1/39), చావ్లా (2/34).. వరుస ఓవర్లలో గిల్, శంకర్‌ను పెవిలియన్‌కు పంపడంతో 12.2 ఓవర్లలో గుజరాత్ 101/4 స్కోరు చేసింది. అయితే, మిల్లర్, మనోహర్ రాకతో ఇన్నింగ్స్ మరో మెట్టు ఎక్కింది. మిల్లర్ సిక్స్‌తో టచ్‌లోకి వస్తే, 15వ ఓవర్‌లో మనోహర్ 4, 4, 6తో 17 రన్స్ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లో 7 రన్సే వచ్చినా, 17వ ఓవర్‌లో మిల్లర్ రెండు సిక్స్‌లు దంచాడు. గ్రీన్ వేసిన 18వ ఓవర్‌లో మనోహర్ 6, 6, మిల్లర్ 6తో 22 రన్స్ వచ్చాయి. తర్వాతి ఓవర్ ఫస్ట్ బాల్‌కు మనోహర్ ఔట్‌కావడంతో ఐదో వికెట్‌కు 71 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. ఇదే ఓవర్‌లో తెవాటియా (5 బాల్స్‌లో 3 సిక్స్‌లతో 20 నాటౌట్), మిల్లర్ మూడు సిక్స్‌లు బాదారు. లాస్ట్ ఓవర్‌లో తెవాటియా మరో రెండు సిక్స్‌లు కొట్టాడు. ఆరో వికెట్‌కు తెవాటియా, మిల్లర్ 10 బాల్స్‌లో 33 రన్స్ జోడించారు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 207/6 (గిల్ 56, మిల్లర్ 46, మనోహర్ 42, చావ్లా 2/34). ముంబై: 20 ఓవర్లలో 152/9 (నేహల్ 40, గ్రీన్ 33, నూర్ అహ్మద్ 3/37).