GT vs MI: ఓడిపోయే మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన.. ముంబైపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ

GT vs MI: ఓడిపోయే మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన.. ముంబైపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ

ఐపీఎల్ లో మ్యాచ్ లు ఉత్కంఠ భరితంగా జరుగుతున్నాయి. గత రెండు రోజులుగా అభిమానులను అలరిస్తూ వస్తున్నాయి. తాజాగా  నేడు (మార్చి 24) ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు మరో థ్రిల్లర్ ను అందించింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. మ్యాచ్ అంతా ముంబై చేతిలోనే ఉన్నా.. చివరి నాలుగు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన గుజరాత్ నే విజయం వరించింది.      

ఛేజింగ్ లో ముంబై ఆరంభంలోనే కిషాన్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత యువ బ్యాటర్ నమన్ ధీర్ కొన్ని మెరుపులు మెరిపించి ఔటయ్యాడు. 30 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో రోహిత్ శర్మ, డెవేల్డ్ బ్రెవిస్ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్ కు వీరిద్దరూ 77 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. 43 పరుగులు చేసిన తర్వాత రోహిత్ ఔట్ కావడంతో గుజరాత్ బౌలర్లు చెలరేగారు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ ముంబై బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. చివర్లో నరాలు తెగే ఉత్కంఠలో టిమ్ డేవిడ్, తిలక్ వర్మ ఔట్ కావడంతో గుజరాత్ ఈ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది.                 

అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగుల స్కోర్ చేసింది. సాయి సుదర్శన్ 45 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. గిల్ 31 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. చివర్లో తివాటియా (22) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. 17 ఓవర్లో మిల్లర్(12), సాయి సుదర్శన్ (45) వికెట్లు తీసుకొని గుజరాత్ భారీ స్కోర్ వెళ్లకుండా అడ్డుకున్నాడు.