గుజరాత్‌లో భారీ నకిలీ నోట్ల స్కామ్ బయటపడింది. భక్తి పేరుతో నకిలీ నోట్ల వ్యాపారం చేస్తున్న ఒక ముఠాను అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. వీరిలో ఒక గురూజీతో పాటు ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు అహ్మదాబాద్, సూరత్ ప్రాంతాల్లో సోదాలు చేసి రూ.2.38 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సూరత్‌లో శ్రీ సత్యం యోగ్ ఫౌండేషన్ (ధామ్) నడుపుతున్న ప్రదీప్ జోతంగియా (ప్రదీప్‌జీ) అనే వ్యక్తి ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి కాగా.. ఈయనను అందరూ గురూజీ అని పిలుస్తారు. గురూజీతో పాటు ఆయన ఆరుగురు శిష్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నకిలీ నోట్లు ఎలా తయారు చేశారంటే:
ముఖేష్ తుమ్మర్ అనే నిందితుడు ఈ రాకెట్‌లో కీలక వ్యక్తి. ఇతను నకిలీ నోట్ల తయారీకి కావాల్సిన ప్రత్యేకమైన వాటర్‌మార్క్ కాగితాన్ని చైనా నుండి తెప్పించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ కాగితం కొనుగోలు కోసం నిందితులు క్రిప్టోకరెన్సీ (Digital Currency) ద్వారా డబ్బులు చెల్లించినట్లు విచారణలో తేలింది. సూరత్‌లోని ఒక ఇంట్లో అత్యాధునిక ప్రింటర్లు, కటింగ్ మెషీన్లు పెట్టి ఈ నోట్లను ముద్రించారు. ఒక్కో ఏ4 సైజు పేపరుపై 3 నోట్లు ముద్రించేవారు. ఈ నోట్లు చూడటానికి అచ్చం అసలు నోట్లలాగే ఉండటం గమనార్హం.
ఈ నకిలీ నోట్లను మార్కెట్లో చెలామణి చేయడానికి ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. ఏజెంట్లకు 20 నుండి 25 శాతం వరకు కమీషన్ ఇచ్చేవారు. వీరు ఇప్పటికే దాదాపు రూ.20 లక్షల విలువైన నకిలీ నోట్లను మార్కెట్లోకి చలామణి చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అరెస్టయిన నిందితులను ప్రదీప్ జోతంగియా (ప్రదీప్‌జీ), ముఖేష్ తుమ్మర్, రమేష్‌భాయ్, భరత్ కాకడియా, అశోక్ మవానీ, రమేష్ బలార్, దివ్యేష్ రాణా సహా ఒక మహిళని గుర్తించారు.
పోలీసులు పట్టుకున్న నోట్ల నమూనాలను పరీక్షల కోసం రిజర్వ్ బ్యాంక్ (RBI), ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా... భక్తి ముసుగులో ఇంత పెద్ద నేరానికి పాల్పడటం ఇప్పుడు గుజరాత్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.
