వీసెన్‌‌హాస్‌‌ ఫ్రీస్టయిల్‌‌ చెస్‌‌ చాలెంజ్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో గుకేశ్‌‌ ఓటమి

వీసెన్‌‌హాస్‌‌ ఫ్రీస్టయిల్‌‌ చెస్‌‌ చాలెంజ్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో గుకేశ్‌‌ ఓటమి

వాంగ్లెస్‌‌ (జర్మనీ) :  ఇండియా గ్రాండ్‌‌మాస్టర్‌‌ డి. గుకేశ్‌‌.. వీసెన్‌‌హాస్‌‌ ఫ్రీస్టయిల్‌‌ చెస్‌‌ చాలెంజ్‌‌ క్వార్టర్‌‌ఫైనల్‌‌ తొలి గేమ్‌‌లో ఓడాడు. సోమవారం జరిగిన గేమ్‌‌లో గుకేశ్‌‌ 39 ఎత్తుల వద్ద వరల్డ్‌‌ రెండో ర్యాంకర్‌‌ ఫ్యాబియానో కరువానా (అమెరికా) చేతిలో పరాజయంపాలయ్యాడు. మిడిల్‌‌ గేమ్‌‌లో ఇండియన్‌‌ గ్రాండ్‌‌మాస్టర్‌‌ అడ్వాంటేజ్‌‌లో నిలిచినా చివర్లో ఒత్తిడికి తలొగ్గాడు.

దీన్ని ఆసరాగా తీసుకున్న కరువానా చకచకా పావులు కదుపుతూ గేమ్‌‌ను నెగ్గాడు. ర్యాపిడ్‌‌లో వరుసగా మూడు గేమ్‌‌ల్లో ఓడిన గుకేశ్‌‌కు ఇది నాలుగో ఓటమి. క్లాసిక్‌‌ టైమ్‌‌ కంట్రోల్‌‌లో భాగంగా జరిగే రెండో గేమ్‌‌లో గుకేశ్‌‌ గెలిస్తేనే సెమీస్‌‌ అవకాశాలు ఉంటాయి. ఇతర గేమ్‌‌ల్లో నొడిర్‌‌బిక్‌‌ అబ్దుసత్తరోవ్‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌).. డింగ్‌‌ లీరెన్‌‌ (చైనా)పై, అలిరెజా ఫిరౌజ (ఫ్రాన్స్‌‌).. మాగ్నస్‌‌ కార్ల్‌‌సన్‌‌ (నార్వే)పై గెలవగా, లెవోన్‌‌ అరోనియన్‌‌ (అమెరికా).. విన్సెంట్‌‌ కీమర్‌‌ మధ్య జరిగిన గేమ్‌‌ డ్రాగా ముగిసింది.