కలవరపెడుతున్న గన్ కల్చర్

కలవరపెడుతున్న గన్ కల్చర్

సిద్దిపేట, వెలుగు: ఇంతకుముందు సిటీలకే పరిమితమైన గన్​కల్చర్​ఇప్పుడు జిల్లాలకూ పాకుతోంది. భూముల రేట్లు అనూహ్యంగా పెరగడంతో రియల్​ఎస్టేట్​దందా జోరందుకుంది. భూవివాదాలు, ఆర్థిక లావాదేవీల్లో గొడవలు, సెటిల్​మెంట్లు, దోపిడీలు సాధారణమయ్యాయి. దీంతో ప్రత్యర్ధులను బెదిరించడానికి.. అవసరమైతే  అడ్డు తొలగించుకోవడానికి గన్స్​వినియోగిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో  ఐదు నెలల్లో మూడుచోట్ల కాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో ఒకరు చనిపోగా.. మరొకరికి గాయాలయ్యాయి. గత నవంబర్ లో హైదరాబాద్​కు చెందిన కొందరు యువకులు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్ పూర్ కు  వేటాడేందుకు వచ్చారు. తాగిన మత్తులో ఎయిర్ గన్ తో సరదాగా జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు చనిపోయాడు. జనవరి 31న సిద్దిపేట అర్బన్ సబ్​రిజిస్ట్రార్​ఆఫీసు దగ్గర నాటుతుపాకితో కాల్పులు జరిపి రూ. 42 లక్షలు దోచుకున్నారు. ఈ ఘటనలో డ్రైవర్​గాయపడ్డాడు. జప్తిలింగారెడ్డిపల్లి దగ్గర పాతకక్షల కారణంగా తల్లీకొడుకులపై తుపాకీతో కాల్పులు జరిపారు.  

కక్షలు తీర్చుకునేందుకు, సెటిల్​మెంట్లకు..

కక్షలు తీర్చుకునేందుకు, సెటిల్​మెంట్లలో ప్రత్యర్థులను బెదిరించేందుకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి అక్రమంగా నాటు తుపాకులను కొనుక్కొస్తున్నారు. సిద్దిపేటలో తాజాగా జరిగిన రెండు కాల్పుల ఘటనల్లో వాడిన తుపాకులు అక్కడి నుంచి తెచ్చినవే. సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీసు దగ్గర దోపిడీకి పాల్పడిన యువకులు మధ్యప్రదేశ్​నుంచి రెండు గన్స్, బుల్లెట్స్​కొనగా.. జప్తిలింగారెడ్డిపల్లి వద్ద వాడిన తుపాకీ, బుల్లెట్లను  ఉత్తర ప్రదేశ్​లో 
రూ.50 వేలకు కొన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి చాలామంది  జిల్లాకు వచ్చి వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. వీరిలో క్రిమినల్ రికార్డులున్న కొందరు నాటు తుపాకుల డీలింగ్​లో స్థానికులకు సహకరిస్తున్నారు. ఆయా స్టేట్​లలో నాటు తుపాకులు రూ.20 వేల నుంచి 50 వేలకే  దొరుకుతున్నాయి. 

జిల్లాలో 38 గన్స్​కు లైసెన్స్​లు 

సిద్దిపేట  పోలీస్ కమిషనరేట్ పరిధిలో  మొత్తం  38 గన్ లైసెన్స్​లు ఉన్నట్టు సమాచారం. బ్యాంకుల దగ్గర సెక్యూరిటీ సిబ్బంది వెపన్స్​కు ఇచ్చిన లైసెన్సులే ఎక్కువగా ఉన్నాయి. కొందరు లీడర్లు తమ ప్రాణాలకు ప్రమాదం ఉందన్న కారణంగా గన్  లైసెన్స్ లు తీసుకున్నారు. గన్​ లైసెన్స్​ల వివరాలను పోలీసులు గోప్యంగా వుంచుతున్నారు. ఇటీవల జరిగిన రెండు కాల్పుల ఘటనలతో జిల్లా పోలీసులు అక్రమ ఆయుధాల మీద దృష్టి పెట్టారు. అక్రమంగా ఎవరి దగ్గరన్నా వెపన్స్​ఉన్నాయా అన్నది ఆరా తీస్తున్నారు. ఈ కేసుల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసి స్పెషల్​టీమ్ లు అక్రమ ఆయుధాలను వెలికితీసే పనిలో ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లాలోనూ.. 

రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ వివాదాలతో ఈ నెల 2న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కర్ణంగూడలో ఇద్దరు రియల్టర్లను ప్రత్యర్థులు కాల్చి చంపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్​రెడ్డి, రాఘవేందర్​రెడ్డితో ప్రధాన నిందితుడైన మెరెడ్డి మట్టారెడ్డి అలియాస్‌‌‌‌ అశోక్‌‌‌‌రెడ్డికి భూతగాదాలున్నాయి. చర్ల పటేల్‌‌‌‌గూడెంలోని 369, 371, 372 సర్వే నంబర్లలోని15 ఎకరాల భూమికి సంబంధించిన వివాదాల వల్లే  మట్టారెడ్డి జంట హత్యలు చేయించాడని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఈ కేసులో మట్టారెడ్డితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్‌‌‌‌ చేశారు. రంగారెడ్డి జిల్లాలో భూముల రేట్లు బాగా పెరగడం వల్లే రాఘవేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, శ్రీనివాస్‌‌‌‌రెడ్డి లిటిగేషన్​ భూములను కొనడం, సెటిల్​మెంట్లు చేయడం పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా శ్రీనివాస్​రెడ్డి ఎల్బీనగర్​లో చోటా నయీం పేరుతో భూదందాలు, రియల్​ఎస్టేట్​చేసేవాడని, ఈ క్రమంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడని తెలుస్తోంది.

అక్రమంగా గన్స్​ ఉంటే  చర్యలు

అక్రమంగా ఆయుధాలు ఉన్నవాళ్లమీద కఠిన చర్యలు తీసుకుంటాం.  లైసెన్స్ తుపాకీతో బెదిరింపులు,  సెటిల్మెంట్లకు పాల్పడితే శిక్ష తప్పదు. అక్రమ ఆయుధాలు, బెదిరింపులకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసుల దృష్టికి తేవాలి. సమాచారం ఇచ్చినవారి వివరాలు సీక్రెట్​గా ఉంచడమే కాకుండా పారితోషికం ఇస్తాం. 
- ఎన్.శ్వేత,  సిద్దిపేట సీపీ