ఏ జిల్లాలోనూ పూర్తిగా విలీనం కాని మండలం

ఏ జిల్లాలోనూ పూర్తిగా విలీనం కాని మండలం

గుండాలకు జిల్లా గండం

సగం డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు యాదాద్రిలో… మరో సగం జనగామలో…

రెండేళ్లయినా నెరవేరని హామీ

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

యాదాద్రివెలుగు:  వారంతా… యాదాద్రి జిల్లాలోనే ఉంటామన్నరు… అయినా వినకుండా జనగామలో కలిపారు. ప్రజలు ఆందోళన చేయడంతో తిరిగి యాదాద్రిలో చేరుస్తున్నామని ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చి రెండేళ్లు అవుతోంది. అయినా ఇప్పటివరకు అన్ని డిపార్ట్ మెంట్లను విలీనం చేయలేదు. దీంతో ప్రజలు సగం పనులు జనగామలో, మరో సగం యాదాద్రిలో చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తాము ఏ జిల్లాకు చెందిన వాళ్లమో కూడా తెలియడం లేదని గుండాల మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్వయంగా ప్రకటించిన సీఎం కేసీఆర్

తెలంగాణలో 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాను యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలుగా విభజించారు. ఈ టైంలో ఆలేరు నియోజకవర్గంలో ఉన్న గుండాల మండలాన్ని ఉమ్మడి వరంగల్ కు చెందిన జనగాం జిల్లాలో చేర్చారు. కానీ తాము యాదాద్రి జిల్లాలోనే ఉంటామంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన ప్రభుత్వం ఈ మండలాన్ని యాదాద్రిలో కలపాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని 2018 నవంబర్ 27న సీఎం కేసీఆరే స్వయంగా యాదగిరిగుట్టలో ప్రకటించారు. ఈ మేరకు 2019 ఫిబ్రవరి 23న ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇది జరిగి రెండేళ్లు కావొస్తోంది. అయినా ఇప్పటివరకు ఎనిమిది శాఖలనే విలీనం చేశారు. మిగతా వాటికి సంబంధించిన వివరాల కోసం ఆన్ లైన్ లో పరిశీలిస్తే ఈ మండలం ఇంకా జనగామ జిల్లాలో ఉన్నట్లుగానే చూపిస్తోంది.

కీలకమైన శాఖలన్నీ జనగామలోనే…

గుండాల మండలాన్ని యాదాద్రిలో చేరినప్పటికీ కీలకమైన పోలీస్, హెల్త్, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, మోటార్ వెహికల్, ట్రైబర్ వెల్ఫేర్ వంటి శాఖలన్నీ జనగామ జిల్లాలోనే కొనసాగుతున్నాయి. గుండాల పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల పరిస్థితి మరీ విచిత్రం. ఇక్కడ నమోదైన కేసులకు సంబంధించిన పర్యవేక్షణ జనగామ జిల్లా పోలీసులు చేస్తుండగా.. కోర్టు విచారణకు మాత్రం యాదాద్రి జిల్లాలోని ఆలేరుకు వస్తుంటారు. అలాగే హెల్త్ డిపార్ట్ మెంట్ కూడా జనగామలోనే ఉండడంతో ఈ జిల్లాకు సంబంధించిన కరోనా లెక్కలపై స్పష్టత ఉండడం లేదు. ఈ మండలానికి చెందిన ప్రజలెవరైనా భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనగామ జిల్లా కొడకండ్లకు వెళ్లాల్సి వస్తోంది. అదే యాదాద్రి జిల్లాలో కలిపితే కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మోత్కూరులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరీ చిత్రం ఏంటంటే ఐసీడీఎస్ లోని కొన్ని విభాగాలు యాదాద్రిలో, మరికొన్ని జనగామలో కొనసాగుతున్నాయి.

ఇంకెన్నాళ్లు

యాదాద్రి జిల్లాలో గుండాలను విలీనం చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి ఏడాది గడిచింది. ఇప్పటివరకూ అన్ని శాఖలను యాదాద్రిలో విలీనం చేయలేదు. దీంతో మేము ఏ జిల్లాకు చెందిన వాళ్లమో కూడా అర్థం కావట్లేదు.  ఇలా ఇంకెన్నాళ్లు రెండు జిల్లాల్లో ఉండాలి. -సాయిప్రసాద్, గుండాల

త్వరలోనే వస్తాయి

గుండాల మండలానికి చెందిన అన్ని డిపార్డుమెంట్లు జనగామ జిల్లా నుంచి పూర్తి స్థాయిలో విలీనం కాలేదు. ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి. త్వరలోనే అన్ని శాఖలు జిల్లాకు వస్తాయి. -కలెక్టర్, అనితారామచంద్రన్, యాదాద్రి.