ట్రంప్ రిసార్టు లోకి గన్ తో దుండగుడు.. కాల్చిచంపిన బలగాలు : అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు

ట్రంప్ రిసార్టు లోకి గన్ తో దుండగుడు.. కాల్చిచంపిన బలగాలు : అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌కు చెందిన ఫ్లోరిడాలోని మార్- ఏ -లాగో రిసార్టులోకి గన్ తో సహా చొరబడిన ఓ దుండగుడిని కాల్చి చంపినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెల్లడించారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున1.30 గంటల సమయంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. నార్త్ కరోలినాకు చెందిన ఇరవై ఏళ్ల వయసున్న యువకుడు కారులో రిసార్ట్ భద్రతా ప్రాంతంలోకి ప్రవేశించాడని, అతని వద్ద గ్యాస్ కాన్‌‌తో పాటు షాట్‌‌గన్ ఉన్నట్లు గుర్తించారమని చెప్పారు. అతను కొన్ని రోజులుగా కనిపించడంలేదని కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు. 

‘‘భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకుని, ఆయుధాలను వదిలేయాలని ఆదేశించారు. అయితే గ్యాస్ కాన్‌‌ను వదిలిన అనంతరం అతడు షాట్‌‌గన్‌‌తో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడున్న ఇద్దరు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ఒక పోలీసు అధికారి అతడిపై కాల్పులు జరిపారు” అని వివరించారు. మృతుడిని 21 ఏళ్ల ఆస్టిన్ టకర్ మార్టిన్‌‌గా గుర్తించినట్లు దర్యాప్తుకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. 

ఘటన సమయంలో ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ ఇద్దరూ వైట్ హౌస్‌‌లోనే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఎఫ్‌‌బీఐ దర్యాప్తు చేపట్టిందని, మృతుడి ఉద్దేశం ఏంటన్నది ఇంకా పరిశీలనలో ఉందని తెలిపారు. మార్- ఏ -లాగో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ సీసీటీవీ ఫుటేజ్ లో నిందితుడి కదలికలు  ఉంటే అందించాలని కోరారు. కాగా, ట్రంప్‌‌పై గతంలో కూడా హత్యాయత్నాలు జరిగిన నేపథ్యంలో తాజా ఘటన మరోసారి కలకలం సృష్టించింది.