
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ఇంటి ముందు కాల్పుల కలకలం సృష్టించాయి. ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం ఉదయం 4 గంటల 55 నిమిషాలకు గుర్తు తెలియని ఇద్దరు దుండగులు హెల్మెట్ ధరించి కాల్పులు జరిపారు. మూడు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు దుండగులు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దుండగుల కాల్పులతో సల్మాన్‌ఖాన్ ఇంటికి భధ్రతను పెంచారు పోలీసులు.
గతంలో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని చాలాసార్లు బెదిరించాడు. ఒక ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యం అని బహిరంగంగా చెప్పాడు.
కాగా ఈ ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కు వై ప్లస్ సెక్యూరిటీ ఉంది.