మహిళను లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ ఘటనపై విచారణ

మహిళను లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ ఘటనపై విచారణ

గుంటూరు: పెళ్లికి హాజరై బైకుపై ఇంటికి తిరిగి వెళ్తున్న దంపతులపై నగర శివార్లలో దుండగులు అడ్డగించి దాడి చేసి.. భర్తను కొట్టి బంధించి.. అతని కళ్లెదుటే భార్యను రోడ్డుపక్కన పొలాల్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటనపై పోలీసు యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ప్రతిపక్షాలు, మహిళా సంఘాల విమర్శల నేపధ్యంలో కేసును సవాల్ గా తీసుకుని పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

గుంటూరు శివార్లలోని మేడికొండూరు అడ్డరోడ్డు సమీపంలో కోల్డ్ స్టోరేజీ నిర్మాణ పనుల వద్ద ఒడిశా కార్మికులను గమనించి విచారించారు. ఘటన జరిగిన ప్రదేశానికి నలువైపులా ఉన్న గ్రామాలు.. పట్టణాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు. మరో వైపు మహిళా డీఎస్పీ ప్రశాంతి ఘటనా స్థలానికి చేరుకుని బాధితులు చెప్పిన కోణంలో ఘటన ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. బాధితురాలికి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించి ధైర్యం చెప్పి ఓదార్చారు. వీలైనంత తొందర్లోనే నిందితులను పట్టుకునేందుకు నిఘా  పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.