అద్దెకు బాయ్ ఫ్రెండ్..వాలెన్ టైన్స్ డేకి బుక్ చేసుకోండి

అద్దెకు బాయ్ ఫ్రెండ్..వాలెన్ టైన్స్ డేకి  బుక్ చేసుకోండి

వాలెన్ టైన్స్ డే వచ్చిందంటే చాలు ప్రేమ జంటలు ఎక్కడికి వెళ్లాలా అని ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మరి సింగిల్‭గా ఉన్నవాళ్లు బోర్‭గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారి కోసం గురుగ్రామ్‭కు చెందిన ఓ యువకుడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. వాలెన్ టైన్స్ డే రోజున సింగిల్‭గా ఉండాలంటే బోర్ గా ఫీల్ అయ్యేవాళ్లు తన సేవలు ఉపయోగించుకోవచ్చని తెలిపాడు. అయితే.. లైంగిక అవసరాల కోసం మాత్రం కాదని.. కేవలం వారికి ఒంటరితనాన్ని దూరం చేయడానికి తాను అందుబాటులో ఉంటానని వివరించాడు. ఒంటరితనంతో బాధపడే వారి కోసం 2018లోనే ఈ సేవలను తాను ప్రారంభించానని.. గురుగ్రామ్‭కి చెందిన షాకుల్ గుప్తా పేర్కొన్నాడు. 

తనకు జీవితంలో ఎదురైన అనుభవం నుంచే ఈ ‘అద్దెకు బాయ్ ఫ్రెండ్’ అనే కాన్సెప్ట్‌ను తీసుకువచ్చానని షాకుల్ గుప్తా తెలిపాడు. వాలంటైన్స్ డే రోజున ప్రేమికులు ఒకరికొకరు ఐ లవ్యూ చెప్పుకుని తమ ప్రేమను వ్యక్తం చేయడం సర్వసాధారణమని, అలాంటి మాటలు వింటుంటే తమకూ ఓ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండేదని ఒంటరి యువత భావిస్తుందని అన్నాడు. ఆ సమయంలో ఒంటరితనం వేధిస్తుందని, తాను కూడా గతంలో బాధపడ్డానని షాకుల్ తెలిపాడు. అటువంటి వాళ్లు కొంత ఫీజు చెల్లించి తన సేవలను బుక్ చేసుకోవచ్చని వివరించాడు. అద్దెకు బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్‌లో.. తనను అద్దెకు తీసుకున్న మహిళ ఒంటరితనాన్ని పోగొడతానని, కబుర్లు చెప్పడం, వారికోసం వంట చేసి పెట్టడం సహా పలు రకాల సేవలందిస్తానని చెప్పాడు. కేవలం ప్రేమికుల రోజున మాత్రమే కాకుండా మిగతా రోజుల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయని షాకుల్ తెలిపాడు.