ఇందిరాపార్క్ వద్ద గురుకుల ఉపాధ్యాయుల మహాధర్నా

ఇందిరాపార్క్ వద్ద గురుకుల ఉపాధ్యాయుల మహాధర్నా

హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద గురుకుల ఉపాధ్యాయులు మహాధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి ఉపాధ్యాయులు  పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. తమ సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలంటూ గురుకుల ఉపాధ్యాయులు మహా ధర్నా చేపట్టారు.

డిమాండ్లు ఇవే :

* విద్యాసంస్థల్లో బోధన సమయాన్ని  9 గంటల నుండి నాలుగున్నర గంటల వరకు ఉండే విధంగా సమయం మార్చాలి

* అన్ని సొసైటీలోనూ ఏకరూప పాలన అమలు చేయాలి

* బదిలీలు, ప్రమోషన్స్ వంటి షెడ్యూల్స్ ను వెంటనే విడుదల చేయాలి

* అన్ని గురుకులాల విద్యాలయాలకు శాశ్వత భవనాలు, క్వార్టర్స్ నిర్మించాలి

* సెలవుల్లో డ్యూటీ చేసిన ఉపాధ్యాయులకు వీక్ ఆఫ్ వర్తింపజేయాలి 

న్యాయబద్దమైన డిమాండ్స్ : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి 

గురుకుల ఉపాధ్యాయుల డిమాండ్స్ న్యాయ బద్దమైనవని, వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే వరకూ పోరాటం చేద్దామన్నారు. దాదాపు 23 డిమాండ్స్ తో ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన మహాధర్నాకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మద్దతు తెలిపారు. శ్రమకు తగ్గ వేతనం, కష్టానికి తగ్గ గుర్తింపు ఉపాధ్యాయులకు దక్కడం లేదన్నారు. గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని హామీ ఇచ్చారు.