ఇల్లు అమ్మి అకాడమీ కట్టా

ఇల్లు అమ్మి అకాడమీ కట్టా

నాలుగేళ్లుగా ప్రభుత్వ సాయం కోరుతున్నా స్పందన లేదు
ఈ నెల చివర్లో అకాడమీ ప్రారంభం: గుత్తా జ్వాల
అకాడమీ వెబ్‌ సైట్‌ లాంచ్‌ చేసిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌‌, వెలుగు: అకాడమీ ఏర్పాటు చేసేందుకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ నాలుగేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఇండియా డబుల్స్‌ స్టార్‌ షట్లర్‌ గుత్తా జ్వాల చెప్పింది. దాంతో, ఓ ఇల్లు అమ్మి .. నగరంలో అకాడమీని నిర్మించానని తెలిపింది. ఇప్పటికైనా గవర్నమెంట్‌ హెల్ప్‌‌ చేస్తుందన్న ఆశతో ఉన్నానని చెప్పింది. మొయినాబాద్‌‌లోని సుజాత స్కూల్‌‌లో 55 ఎకరాల స్థలంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ‘గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్‌ ఎక్స్‌ లెన్స్‌’ను మరికొద్ది రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పింది. ఈ అకాడమీ వెబ్‌‌సైట్‌‌ను రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జ్వాల.. బ్యాడ్మింటన్‌‌ అకాడమీ తన కల అని చెప్పింది. ‘ఇది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌‌. నాతో పాటు అమ్మానాన్న ఎంతగానో ఆలోచించి, ఎంతో ప్యాషన్‌‌తో అకాడమీ కట్టాం. స్థలం ఇవ్వాలని నాలుగేళ్ల నుంచి గవర్నమెంట్‌‌ను రిక్వెస్ట్‌‌ చేశాం . కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఓ ఇల్లు అమ్మి అకాడమీ నిర్మించాం. అయితే, ప్రభుత్వాన్ని నేను విమర్శించాలనుకోవడం లేదు. కేటీఆర్‌ .. మా వెబ్‌‌సైట్‌‌ను లాంచ్‌ చేయడం సంతోషకరం. ఇది చూసిన తర్వాత అయినా గవర్నమెంట్‌ నాకు సాయం చేస్తుందని ఆశిస్తున్నా. హైదరాబాద్‌ నుంచే నేను ఎదిగాను, కాబట్టి ఇక్కడే అకాడమీ ఏర్పాటు చేయాలని అనుకున్నా. ఇది వరల్డ్‌‌ క్లాస్‌ అకాడమీ. 14 బ్యాడ్మింటన్‌‌ కోర్టులు ఉన్నాయి. దీన్ని కేవలం బ్యాడ్మింటన్‌‌ అకాడమీగా మాత్రమే చూడడం లేదు. మున్ముందు క్రికెట్‌, టెన్నిస్‌, స్విమ్మిం గ్‌, స్కేటింగ్‌‌లో కూడా శిక్షణ ఇస్తాం. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదట్లో అకాడమీ ప్రారంభమవుతుంది’ అని జ్వాల తెలిపింది.

మన కోచింగ్‌ సిస్టమ్‌ వీక్‌
దేశంలో చాలా అకాడమీలు కేవలం సింగిల్స్‌ పైనే ఫోకస్‌ పెట్టాయని, డబుల్స్‌కు సరైన సౌకర్యాలు గానీ, మంచి కోచ్‌‌లు గానీ లేరని జ్వాల చెప్పింది. అందుకే ఈ కేటగిరీలో సరైన ఫలితాలు రావడం లేదని అభిప్రాయపడింది. దీనికి కారణం ఎవరో అందరికీ తెలుసన్నది. వచ్చే ఒలింపిక్స్‌‌లో సింగిల్స్‌ నుంచి మాత్రమే మెడల్‌ ఆశించగలమని తెలిపింది. ఈ పరిస్థితిని మార్చి డబుల్స్‌‌లో కూడా మంచి రిజల్ట్స్‌ రాబట్టడమే తన లక్ష్యమని జ్వాల చెప్పింది. ‘కేవలం సింగిల్స్‌‌లో రాణించి నంతమాత్రాన బ్యాడ్మింటన్‌‌లో ఇండియా వరల్డ్‌‌ మ్యాప్‌ లోకి రాదు. ఈ విషయం నేను ఎప్పటి నుంచో చెబుతున్నా. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ, ఇప్పుడు డబుల్స్‌‌లో మన పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి. డబుల్స్‌ ప్లేయర్లు కూడా అంతర్జాతీయ టోర్నీల్లో పోటీ పడితే సరిపోతుంది అనే మైండ్‌‌సెట్‌‌తో ఉన్నారు. కానీ, దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. మా అకాడమీలో అన్ని విభాగాలకు సమ ప్రాధాన్యత ఇస్తాం. ఇండియాతో పాటు ఫారిన్‌‌ కోచ్‌‌లతో శిక్షణ ఇప్పిస్తాం. ప్రస్తుతం మన దేశంలో కోచింగ్ సిస్టమ్‌ చాలా వీక్‌‌గా ఉంది. ప్రతిసారి ఫారిన్‌‌ కోచ్‌‌ల వైపే మొగ్గు చూపుతున్నాం. ఇండియా కోచ్‌‌లపై నమ్మకం ఉంచలేకపోతున్నాం. వారి సంక్షేమం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే దేశంలో కోచ్‌‌ల కొరత ఏర్పడింది. డబుల్స్‌‌లో నేను ఎక్స్‌పర్ట్‌‌ను అయినా
ట్రైన్డ్‌‌ కోచ్‌‌ను కాదు. అందువల్ల నేను కోచింగ్‌‌లో తలదూర్చను’ అని గుత్తా చెప్పుకొచ్చింది.

అది నా పర్సనల్‌ .. నో కామెంట్‌
తమిళ నటుడు విష్ణు విశాల్‌‌తో రిలేషన్‌‌షిప్‌ పై స్పందించేందుకు జ్వాల నిరాకరించింది. విష్ణుతో క్లోజ్‌‌గా ఉన్న ఫొటోలను జ్వాల తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వీరిద్దరూ డేటింగ్‌‌లో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. న్యూ ఇయర్‌ సందర్భంగా కూడా విష్ణు తనను కిస్‌ చేస్తున్న ఫొటోను ట్విటర్‌‌లో పోస్ట్‌‌ చేసిన జ్వాల.. ‘మై బేబీ.. హ్యాపీ న్యూ ఇయర్‌ ’అని క్యాప్షన్‌‌ ఇచ్చిం ది. అయితే, విష్ణుతో రిలేషన్‌‌షిప్‌ .. తన పర్సనల్‌ విషయమని, దాని గురించి తానేమీ మాట్లాడనని జ్వాల స్పష్టం చేసింది.

For More News..

79 ఏళ్ల వయసులో ఎలక్షన్స్‌లో పోటీచేసి గెలిచిన బామ్మ

4 నిమిషాల్లో 51 మంది ప్రముఖుల గొంతు మిమిక్రీ