
- వానాకాలం నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీలో ప్రత్యేక కార్యక్రమాలు
- గ్రేటర్ వరంగల్క్లీన్ సిటీ కోసం ప్రోగ్రాం షురూ
- జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు డివిజన్ల బాటలో ఆఫీసర్లు
- గ్రేటర్ 66 డివిజన్లలో సమస్యలపై వివిధ శాఖల టీం వర్క్
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్‌ను క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు, వరద ముంపు నివారణ, సీజనల్ వ్యాధుల కంట్రోల్ కోసం 100 రోజుల స్పెషల్ డ్రైవ్ మొదలయ్యింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ ద్వారా తెలంగాణ రైజింగ్–2047 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమంతో ఏటా వానాకాలంతో వరంగల్ నగరంలో వరదలు, ముంపు కాలనీలకు ఇబ్బందులు తప్పనున్నాయి. కాగా, జూన్ 2న ప్రారంభమైన ఈ స్పెషల్ ప్రోగ్రాం సిటీ జనాల ఆరోగ్యానికి, డివిజన్లలోని సమస్యల పరిష్కారానికి, కాలనీల అభివృద్ధికి దోహదపడేలా ఉన్నా, జీడబ్ల్యూఎంసీ అధికారులు ఎంత వరకు సక్సెస్ చేస్తారో చూడాలి.
వానాకాలంలో ముంపు భయం..
వానాకాలం వచ్చిందంటే చాలు వరంగల్ సిటీ వణికిపోతోంది. గ్రేటర్‍లోని వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ పరిధిలో 66 డివిజన్లు ఉండగా, సుమారు 1400 కాలనీలున్నాయి. ఇందులో 100 నుంచి 120 వరకు ముంపు కాలనీలున్నాయి. వరంగల్‌లోని ఎన్టీఆర్ నగర్, సుందరయ్యనగర్, ఎస్సార్‍నగర్, లక్ష్మీగణపతి నగర్, మాధురి నగర్, కాశీబుగ్గ, దేశాయిపేట, గాంధీ నగర్, సూర్జిత్‍నగర్, గాయత్రి కాలనీ, ఉర్సు, కరీమాబాద్, రంగంపేట, ఎస్‍ఆర్‍ఆర్‍తోట, చింతల్, శివానగర్, హంటర్‍రోడ్డువంటి ఎన్నో కాలనీలున్నాయి.
సుమారు 400 కాలనీల్లో అంతర్గత మోరీలే లేవు. చిన్న వర్షం పడ్డా ఇండ్లల్లోకి నీరు చేరుతోంది, రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. హనుమకొండ ప్రాంతంలో ప్రధాన నయీంనగర్ నాలా వెడల్పు చేసి, రిటర్నింగ్ వాల్ కట్టడంతో కొంత ప్రమాదం తప్పినా, వరంగల్ తూర్పు పరిధిలో నాలాలు ప్రమాదకరంగా ఉన్నాయి. కాలనీల రోడ్లు గుంతలుగా మారాయి. డ్రైన్లలో చెత్త క్లీన్ చేస్తున్నామని చెబుతున్నా చాలాచోట్ల కాలువల్లో వరద ముందుకు వెళ్లలేని దుస్థితి ఉంది. దీంతో ఏటా నగరంలో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
100 రోజుల్లో చేపట్టే పనులు..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 100 రోజుల కార్యక్రమంలో భాగంగా 50 అంశాలతో పనులు చేపడుతున్నారు. ఇందుకోసం వివిధ శాఖలతో కోఆర్డినేట్ చేసుకుని అధికారులు తమ సిబ్బందితో కలిసి 66 డివిజన్ల బాట పట్టనున్నారు. నాలాలు, మురుగు కాలువల్లో పూడికతీత, తడి, పొడి చెత్తలను వేరుచేసేలా ప్రోత్సాహం, పిచ్చి మొక్కల తొలగింపు, దోమల నియంత్రణ, ఓపెన్ ఏరియాల శుభ్రం, ఆరోగ్య శిబిరాల ఏర్పాటు, భువన సర్వే, బిజినెస్ లైసెన్స్‌లు, కమర్షియల్ బిల్డింగుల గుర్తింపు, తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకుల క్లీన్, లోతట్టు ప్రాంతాల్లో గుంతలు పూడ్చడం, శిథిలమైన భవనాల తొలగింపు, డ్రైన్లపై మెష్‍ల ఏర్పాటు, జంక్షన్ల అభివృద్ధి, వీధి కుక్కల సంతాన నియంత్రణ, ఇంకుడు గుంతల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, నీటి క్లోరినేషన్ స్థాయి పరీక్షలతోపాటు వన మహోత్సవంలో మొక్కలు నాటడం వంటివి చేపటనున్నట్లు అధికారులు తెలిపారు.
-
పనితీరుపై అనుమానాలు..
వరంగల్ క్లీన్ సిటీ కోసం 100 రోజులు” కార్యక్రమ ఉద్దేశం భాగానే ఉన్నా, ఇందులో చేయడంలో గ్రేటర్ అధికారులు ఏ మేరకు సక్సెస్ అవుతారనే చర్చ నడుస్తోంది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి ప్రోగ్రాంలను విజయవంతం చేయడంలో బల్దియా అధికారులు పెద్దగా శ్రద్ధ చూపలేదు. ప్రత్యేక కార్యక్రమాలను సాకుగా తీసుకుని అసలు పనులకు బదులుగా ఫ్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చి మమా అనిపిస్తారనే అపవాదు వారిపై ఉంది.
కాగా, ప్రస్తుత 100 రోజుల ప్రోగ్రాంలో ప్రధానంగా శానిటేషన్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్‍తోపాటు హెల్త్ డిపార్టుమెంట్ ఒక యూనిట్‍గా పనిచేయాల్సి ఉంది. సమస్యలను గుర్తించి, వాటిని సకాలంలో పూర్తి చేయాల్సి ఉంది. ఫీల్డ్‌లో సమస్యలు పరిష్కరించేవాటితోపాటు అవగాహన కార్యక్రమాలు సైతం ఉన్నాయి. ఈ కార్యక్రమం వరంగల్ బల్దియా అధికారుల పనితీరుకు పరీక్ష అవనుంది.