చనిపోయిన వ్యక్తులను బతికించే రోజులు వస్తాయని.. 4 ఏళ్లుగా శవాన్ని ఫ్రీజర్ లో ఉంచిన ఫ్యామిలీ..!

చనిపోయిన వ్యక్తులను బతికించే రోజులు వస్తాయని.. 4 ఏళ్లుగా శవాన్ని ఫ్రీజర్ లో ఉంచిన ఫ్యామిలీ..!

2026 సంవత్సరం.. రోబోలు నడుస్తున్న కాలం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తున్న కాలం.. అన్నింటి కంటే ముఖ్యంగా కలియుగం నడుస్తున్న కాలం.. ఈ కాలంలోనూ మూఢ నమ్మకాలు ఉన్నాయా.. చనిపోయిన వ్యక్తిని బతికించే రోజులు వస్తాయని జనం నమ్ముతున్నారా.. అందులోనూ 80 ఏళ్ల వృద్ధుడు చనిపోతే.. నాలుగేళ్లుగా ఆ డెడ్ బాడీని ఫ్రీజర్ లో ఉంచిన ఫ్యామిలీ ఘటన దేశంలో వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్లుగా బయటకురాని ఈ విషయం ఇప్పుడు ఎలా వెలుగులోకి వచ్చింది.. అసలు ఆ ఫ్యామిలీ ఎందుకు నాలుగేళ్లుగా ఆ మృతదేహాన్ని ప్రీజర్ లో ఉంచి కాపాడుతుంది.. ఈ వివరాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

ముంబై పోలీసులు ఓ విచిత్ర మైన కేసును ఎదుర్కొన్నారు. అదేంటంటే..నాలుగేళ్ల క్రితం చనిపోయిన ఓ వృద్ధుడి మృతదేహాన్ని ఓ కుటుంబం ఫ్రిజ్ లో భద్రంగా దాచిపెట్టడం. అదేంటీ చనిపోతే మరుసటి రోజే ఖననం, లేదా దహనం చేస్తాం కదా ..మరీ వీళ్లేంటి ఇలా మృతదేహాన్ని నాలుగేళ్లుగా దాచి ఉంచారని విస్తుపోయారు. ఆ కుటుంబం ఇచ్చిన షాక్ నుంచి బయటికొచ్చి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.  

ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ముంబై మలాడ్ లోని ఆస్పత్రిలో వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. టెక్నాలజీపై విపరీతమైన నమ్మకం పెట్టుకున్న ఆ కుటుంబం..  పెద్దమనిషి బతికించుకోవచ్చని నమ్మింది. రాబోయే రోజుల్లో చనిపోయిన వారిని తిరిగి బతికించగల టెక్నాలజీ వస్తుందని నమ్మి ఈ పనిచేసింది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..చనిపోయిన ఆ వృద్దుడి మృతదేహాన్ని భద్రపరచమని కుటుంబ సభ్యులు క్లినిక్ కు సూచించారు.ఆ పెద్దాయన మృతితో తీవ్ర మనోవేదనకు గురయ్యామని, మృతదేహాన్ని ఎక్కువ కాలం భద్రపరిచే అమెరికాలోని క్రయోనిక్స్ సెంటర్ కు తరలించాలని చెప్పారు. 

ALSO READ : స్కూళ్లలో AI వాడకానికి జైకొడుతున్న టీనేజర్లు

కణాలు, కణజాలాలు, పిండాల క్రయోప్రిజర్వేషన్ ఒక రకమైన శాస్త్రీయ పద్ధతి. మరణానంతరం మానవ అవశేషాలను అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద భద్రపరచడాన్ని క్రయోనిక్స్ అంటారు. వైద్య సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి ఒకనాటికీ పునరుజ్జీవం సాధ్యం చేస్తుందనే ఆశతో దీనిని చేస్తారు.క్రయోనిక్స్ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది.  మన దేశంలో ఈ పద్ధతిని నిషేధించే లేదా అనుమతించే నిర్దిష్ట చట్టం ఏదీ లేదు.

కొసమెరుపేంటంటే.. చనిపోయిన ఆ వ్యక్తి భార్య, పిల్లలు ముంబైలో నివసిస్తున్నారు. వారి గుర్తింపుతో పాటు, మృతుడి వివరాలను కూడా వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహం ఆ సెంటర్ లో  ఉన్నంత కాలం కుటుంబ సభ్యులు, క్లినిక్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.

మరణాన్ని అంగీకరించలేని మనస్తత్వం, టెక్నాలజీపై ఉన్న ఆశలు కలిసి ఈ కుటుంబాన్ని ఇలాంటి నిర్ణయానికి నడిపించినట్లు తెలుస్తోంది. నాలుగేళ్లుగా ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని భద్రపరచడం వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.