స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు కీలక హెచ్చరిక. ఎస్‌బీఐ తన ఏటీఎం రూల్స్ లో కీలక మార్పులు చేసింది. అక్టోబర్ 1, 2026 నుంచి కొత్త నిబంధనలు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా శాలరీ అకౌంట్లు కలిగిన కస్టమర్లుఈ మార్పుల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.
ఎస్‌బీఐ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ వేరియంట్లు కలిగిన ఖాతాదారులు ఇకపై ఇతర బ్యాంకుల ఏటీఎంలు, ఆటోమేటెడ్ డిపాజిట్ కమ్ విత్‌డ్రాయల్ మెషిన్ల వద్ద కేవలం 5 ఉచిత లావాదేవీలను మాత్రమే పొందగలరు. ఇప్పటివరకు ఈ పరిమితి 10 లావాదేవీలుగా ఉంది. దేశంలోని అన్ని కేంద్రాలలోనూ ఈ ఉచిత పరిమితిని 10 నుంచి 5కి కుదించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు రెండు కూడా ఈ పరిమితి కిందకే వస్తాయి.
మరోవైపు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు సంబంధించి ఎలాంటి మార్పులు లేవు. వీరికి నెలలో అందించే నాలుగు ఉచిత నగదు విత్‌డ్రాయల్స్ యథావిధిగా కొనసాగుతాయి. ఆ తర్వాత జరిగే ప్రతీ లావాదేవీకి రూ.15 తో పాటు జీఎస్టీ అదనంగా వసూలు చేయబడుతుంది. కాబట్టి ఎస్‌బీఐ కస్టమర్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడేటప్పుడు ఈ పరిమితిని దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం.
ALSO READ : ఫిక్స్‌డ్ డిపాజిట్ రూల్స్ మారాయి
ఖాతాదారులు అనవసరమైన ఛార్జీల భారం నుంచి తప్పించుకోవడానికి డిజిటల్ లావాదేవీలను ఆశ్రయించడం మంచిది. ఎలాంటి పరిమితులు లేకుండా అన్ని రకాల డిజిటల్ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని బ్యాంకు స్పష్టం చేసింది. ఏటీఎంల వాడకాన్ని తగ్గించుకుని యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించడం ద్వారా అదనపు ఛార్జీలను తప్పించుకోవచ్చు కస్టమర్లు.
