
- తిరిగి రావాలని కంపెనీల మెయిళ్లతో ఎయిర్‌పోర్ట్‌లకు పరుగులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. శుక్రవారం రాత్రి హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం భారతీయ హెచ్1బీ వీసా హోల్డర్లను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. ట్రంప్ నిర్ణయంతో అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు.. విదేశాల్లో ఉన్న తమ ఉద్యోగులను వెంటనే అమెరికాకు తిరిగి రమ్మంటూ ఈమెయిల్‌లు పంపాయి. దీంతో భారత్‌లో ఉన్న టెకీలు.. తమ కుటుంబ కార్యక్రమాలను మధ్యలోనే వదిలేసి విమానాశ్రయాలకు పరిగెత్తారు. ఇంకొందరు పెండ్లిళ్లు రద్దు చేసుకున్నారు. ఇలాంటి ఘటనలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
రెడ్డిట్‌లో 'సారమచ్' అనే యూజర్ భావోద్వేగంతో ఓ పోస్ట్ పెట్టారు. "కొంచెం కూడా కరుణ, సిగ్గు లేని వారికి ఈ రకంగా చెప్పాల్సి రావడం దురదృష్టకరం. నా తల్లి కన్నీరు పెట్టుకుంది. కొన్నేండ్ల తర్వాత తిరిగి వచ్చిన కూతురును కండ్లారా చూసుకునే లోపే మళ్లీ సాగనంపాల్సి రావడం దురదృష్టకరం" అని రాశారు. "ఇది చాలా అన్యాయం.. కుటుంబంలో జరిగిన ఫంక్షన్లనూ మిస్సయ్యాం. ఏళ్ల తరబడి దూరంగా ఉన్న తాము కుటుంబాన్ని కలుసుకున్న టైంలోనే ఈ నిర్ణయం వెలువడడం దారుణం. దీనివల్ల మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాం" అని ఆమె ముగించింది.
మరో యూజర్ స్పందిస్తూ.. వివాహం చేసుకోవడానికి సెలవు పెట్టి ఇండియాకు వెళ్లాల్సి ఉండగా.. ట్రంప్ తాజా నిర్ణయంతో ఇండియా ట్రిప్ క్యాన్సల్ చేసుకున్నానని, పెండ్లి ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేసుకున్నామని తెలిపాడు. ‘‘భారతీయులకు 'అమెరికన్ డ్రీమ్' ముగిసినట్టే.. అమెరికాలో జీవితం కొనసాగించాలా? వద్దా? అని అందరూ ప్రశ్నిస్తున్నారు" అని ఇంకొకరు పోస్ట్ చేశారు.
కాగా, ఈ ఫీజు కొత్త అప్లికేషన్‌లకు మాత్రమేనని, ప్రస్తుత హెచ్1బీ వీసాధారులు సాధారణంగా ప్రయాణించవచ్చని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లెవిట్ చెప్పడంతో కొందరు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఈ ప్రకటనకు ముందే చాలా నష్టం జరిగిపోయిందని, ముందే ఈ స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు.