డంపింగ్ యార్డుతో ఇబ్బందులు.. తొలగించాలంటూ ధర్నాలు

డంపింగ్ యార్డుతో ఇబ్బందులు.. తొలగించాలంటూ ధర్నాలు

రంగారెడ్డి జిల్లా : బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ హైదర్షాకోట్ విలేజ్ సౌభాగ్యనగర్ కాలనీలోని డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ధర్నా చేశారు. డంపింగ్ యార్డును మరో చోటకు తొలగించాలని పాత కమిషనర్ కు చాలాసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ వాళ్లు సౌభాగ్యనగర్ కాలనీలో చెత్త, చెదారం వేయడం వల్ల భరించలేని దుర్వాసన వస్తోందని, ఇక్కడి నివసించే ప్రజలు తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. 

చెత్త, చెదారం వేయడం వల్ల ఇక్కడి వాటర్ కూడా కలుషితమవుతోందని, వాటర్ గ్రీన్ కలర్ లో సరఫరా అవుతోందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డులో చెత్తను తగలబెట్టడం వల్ల దట్టమైన పొగ కాలనీ మొత్తం వ్యాపిస్తోందని, దీని వల్ల తరచూ రోగాల పాలవుతున్నామని చెప్పారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కంపుతో ముక్కు మూసుకుని ధర్నా చేసి గేటుకు తాళం వేశారు స్థానికులు. 

కొందరు చికెన్ షాపు నిర్వాహకులు కూడా ఇక్కడే చెత్త, చెదారాన్ని వేయడం వల్ల దుర్గంధం వెదజల్లుతోందన్నారు. స్థానిక కార్పొరేటర్(5వ వార్డు) శ్రీనాథ్ రెడ్డి అధికారులకు చాలాసార్లు కంప్లైంట్ చేసినా తొలగిస్తామని చెబుతున్నారే గానీ, ఆ పని మాత్రం చేయడం లేదన్నారు. మరోవైపు కాలనీవాసులకు మద్దతుగా కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి కూడా ధర్నాలో పాల్గొన్నారు. ఇప్పటికైనా బండ్లగూడ మున్సిపల్ అధికారులు డంపింగ్ యార్డ్ తొలగించాలని సౌభాగ్యనగర్ కాలనీ,  సాయిహర్ష కాలనీ, వినాయక నగర్ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.