- అడవిబిడ్డలతో అనుబంధం
- తన కొడుకుకు లచ్చు పటేల్‌గా పేరు
- రాయి సెంటర్ స్థాపన.. ఐటీడీఏ ఏర్పాటుకు కృషి
- నేడు మార్లవాయిలో హైమన్ డార్ఫ్ వర్దంతి
ఆసిఫాబాద్/జైనూర్, వెలుగు: అది జల్.. జంగల్.. జమీన్ కోసం కుమ్రంభీం పోరాటం సాగిస్తున్న సమయం. కొండకోనల్లో ఆదివాసీలు దుర్బర జీవనం సాగిస్తూ కనీస వసతుల కోసం పరితపిస్తున్న వేళ. ఆ సమయం(1941)లో ఆస్ట్రియా దేశానికి చెందిన మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ తన భార్య బెట్టి ఎలిజబెత్ దంపతులు ఆదివాసీల జీవనంపై అధ్యయానికి మన దేశానికి వచ్చారు. ఆదివాసీలు అత్యధికంగా ఉండే ఆసిఫాబాద్ జైనూర్ మండలం మార్లవాయికి చేరుకున్నారు.
గ్రామస్తుడైన ఆత్రం లచ్చు పటేల్ సహాయంతో ఆయన ఎడ్లబండి, గుర్రాలతో ఆదివాసీ గ్రామాల్లో పర్యటించి తన అధ్యయనం ప్రారంభించారు. పూరి గుడిసెల్లో అభివృద్ధికి ఆమడ దూరంలో జీవనం సాగిస్తున్న ఆదివాసీలను చూసి డార్ఫ్ చలించిపోయారు. వారిలో మార్పు కోసం సంకల్పించారు. గ్రామాలను సందర్శిస్తూనే వారి అభివృద్ధి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
అభివృద్ధికి పునాదులు
ఆదివాసీల జీవితాల్లో మార్పు కోసం హైమన్ డార్ఫ్అనేక ప్రయత్నాలు చేశారు. అప్పటి నిజాం సర్కారుతో ఒప్పందం కుదుర్చుకొని 1945లోనే ఆదివాసీలకు భూమి పంపిణీ చేయించారు. దీంతో సంబురాలు చేసుకున్న ఆదివాసీలు పోడు సాగు ప్రారంభించారు. గూడాల్లో విద్య, వైద్యం, ఆర్థికాభివృద్ధి కోసం డార్ఫ్ పరితపించారు. అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులను సంప్రదించి సలహాలు సూచనలు అందజేశారు. ఆయన సూచనల మేరకు సమగ్ర గిరిజన అభివృద్ధికి బాటలు వేశారు. విద్య, వైద్యం, ఆర్థిక పరమైన అభివృద్ధి ఒకే ఏజెన్సీ ద్వారా పథకాలు అందేలా అధికారులు ఐటీడీఏ ఏర్పాటు చేశారు. ఉట్నూర్ లో ఐటీడీఏను ఏర్పాటుచేసి డార్ఫ్ చేతులమీదుగానే ప్రారంభిం చారు. ఇప్పటికీ ఐటీడీఏ ద్వారా గిరిజనుల కోసం ప్రభుత్వాలు కృషి చేస్తునే ఉన్నాయి.
ప్రశాంతమైన పల్లెల కోసం తపననాడు ప్రతి ఊరిలో పటేల్ వ్యవస్థ ఉండేది.
దీంతో 8 నుంచి 10 ఊరుల్లోని పటేల్ లను కలుపుకుని రాయి సెంటర్ వ్యవస్థను స్థాపించారు. ప్రయోగత్మకంగా ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి, తిర్యాణి మండలంలోని గిన్నెధరిలో రాయి సెంటర్ స్టార్ట్ చేయించారు. సామాజికాభివృద్ధి, సరిసమాన న్యాయం, సంస్కృతీసంప్రదాయల పరిరక్షణ, హక్కుల సంరక్షణకు ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించాలని సూచించారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 70 రాయి సెంటర్ కమిటీలు ఏర్పడ్డాయి. ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లో క్రైమ్ రేట్ తగ్గించడానికి ఈ వ్యవస్థ కీలకంగా మారింది.
సంప్రదాయాలకు ఆకర్షితుడై ఆచరణ
కాలక్రమంలో అడవి బిడ్డలతో అనుబంధం పెంచుకున్నాడు. ఆదివాసీల పెండ్లి వేడుకలు, చావు, దైవ కార్యాల్లో పాల్గొని గిరిజనుల సంప్రదాయాలను ఆచరించారు. మార్లవాయిలోనే నివాసం ఏర్పచుకున్నారు. ఇక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఖమ్మం, భద్రాచలం, వరంగల్, విశాఖపట్నం జిల్లాలోని ఆదివాసీల గ్రామాల్లో పర్యటించి వారి స్తితిగతులపై అధ్యయనం చేశారు. తమకు పుట్టిన కొడుకుకు లచ్చు పటేల్(నికోలస్)గా పేరుపెట్టుకున్నారు.
