బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ గుండుకొట్టి.. గాయబ్​

బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ గుండుకొట్టి.. గాయబ్​
  • ఎంట్రీ ఫీజు రూ.300, షాంపూ, ఆయిల్​కు రూ.700 వసూలు
  • నిర్వాహకుడు సూర్యాపేటకు చెందిన హరీశ్​గా గుర్తింపు

ఉప్పల్, వెలుగు: బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ సిటీలో మరో శిబిరం వెలిసింది. ఢిల్లీకి చెందిన సంస్థ నుంచి ఫ్రాంచైజీ తీసుకున్నామంటూ శిబిరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో జనం ఎగబడ్డారు. జుట్టు వస్తుందనే ఆశతో వందల మంది క్యూకట్టారు. సూర్యాపేట జిల్లా రాజానాయక్​తండాకు చెందిన హరీశ్​అనే వ్యక్తి బుధవారం ఉప్పల్ భగాయత్ లో ‘బట్టతలకు మందు’ అంటూ క్యాంప్​ఏర్పాటు చేశాడు. ఎంట్రీ ఫీజును రూ.300గా, బట్టతలకు షాంపూ, ఆయిల్​కింద రూ.700గా పెట్టాడు. స్థానికులతోపాటు, సిటీలోని పలు ప్రాంతాలకు చెందిన వందల మంది క్యాంప్​వద్ద క్యూ కట్టారు. ఒక్కొక్కరు వెయ్యి రూపాయిలు చెల్లించి ట్రీట్​మెంట్​చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. 

వినోద్, రాజశేఖర్​అనే మరో ఇద్దరితో కలిసి శిబిరానికి వచ్చిన కస్టమర్లకు హరీశ్​గుండు కొట్టి ఆయిల్​రాశాడు. తర్వాత తాను ఇచ్చిన షాంపూ, ఆయిల్​వాడాలని తెలిపాడు. విషయం తెలుసుకున్న ఉప్పల్​పోలీసులు అక్కడి చేరుకుని అందరినీ వెళ్లగొట్టారు. శిబిరానికి లీగల్​గా ఎలాంటి అనుమతులు లేవని గుర్తించారు. హరీశ్, వినోద్, రాజశేఖర్​ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే డబ్బులు చెల్లించిన బట్టతల బాధితులు లబోదిబోమన్నారు. తాము చెల్లించిన పైసలు ఇప్పించాలని కోరారు. పోలీసులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొన్నిరోజుల కింద ఇలాగే ఓల్డ్​సిటీలో బట్టతలపై జుట్టు మొలిపిస్తామని ఓ సెలూన్​నిర్వాహకుడు హల్​చల్​చేశాడు.