ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు... దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు... దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి(జులై1) మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా తొలి రోజు (జులై1)  అమ్మవారి ఆలయాన్ని కూరగాయలు, పండ్లతో అలంకరించారు.దర్శనానికి వచ్చే దుర్గమ్మ భక్తులకు ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు కదంబం ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు.. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబం ప్రసాదాన్ని ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు పంపిణీ చేయనున్నారు. 

జులై 2న  బంగారు బోనం

ఆదివారం (జులై2) తెలంగాణ నుంచి బంగారు బోనం అమ్మవారికి సమర్పిస్తారని,ఆషాడ మాసంలో అమ్మవారికి సారె‌ ఇచ్చే వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. ఆషాడంలో అమ్మవారిని శాకంబరీగా అలంకరించి పూజించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోయి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భక్తుల విశ్వాసం. శాకం అంటే కూరగాయలు. వివిధ రకాల కూరగాయలతో అలంకరించి అమ్మవారిని పూజిస్తారు. దీంతో ఈ సమయంలో అమ్మవారిని శాంకబరీదేవి అని పిలుస్తారు. ఈ రోజు నుంచి (జులై 1 నుంచి 3వ తేదీ వరకు) మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై ఈ ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారి ఆలయాన్ని వివిధ ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో అందంగా అలంకరించారు. 

శాకంబరీ దేవి గురించి...

ప్రతి ఏడాది ఆషాడ మాసంలో ఇంద్రకీలాద్రిపై శాకంబరీ దేవి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేశం సస్యశ్యామలంగా ఉండి పాడిపంటలతో అభివృద్ధి చెందేందుకు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నారు. శాకంబరీ దేవి గురించి దేవీ భాగవతంతో పాటుగా మార్కడేయ పురాణంలోని చండీసప్తశతిలో ప్రస్తావన ఉంది. శాకాంబరీ దేవి నీలవర్ణంలో కమలాసనంపై కూర్చుని.. తన పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకొని ఉంటుంది. పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు ధరించి ఉంటుంది. ఆలయ ప్రాంగణాన్ని సైతం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇంద్రకీలాద్రిలో ఉపాలయాలకు కూరగాయలతో తోరణాలు కట్టి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. 

శాకంబరీ పూజ చేస్తే...

జీవులకు కలిగే ఆకలి దప్పి, మృత్యువు, ముసలితనం, జ్వరం మొదలైనవి పోగొడతాయి అంటారు. కాంతులను ప్రసరించే ధనుస్సును ధరించే పరమేశ్వరిని శాకాంబరీ, శతాక్షి, దుర్గ అనే పేర్లతో కీర్తింపబడుతుందని చెబుతున్నారు. ఈ దేవి శోకాలను దూరం చేసి, దుష్టులను శిక్షించి శాంతిని కలుగజేయడమే కాదు పాపాలను పోగొడుతుంది అని నమ్మకం. శాకాంబరీ దేవిని భక్తితో పూజించి, స్తోత్రం చేసేవారు, ధ్యానించేవారు.. అలాగే నమస్కరించేవారు, జపించేవారు, పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారని చెబుతుంటారు.

విజయవాడలో భక్తుల రద్దీ

తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు భక్తుల రద్దీతో నిండిపోయాయి. శాకాంబరీ దేవి దర్శనార్ధం వస్తున్న భక్తులకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెప్పారు. మూడు రోజులపాటు లక్షల్లో భక్తులు దర్శనానికి వస్తారని అంచనా వేశామని, భక్తులకు అమ్మవారి కదంబ ప్రసాదం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు.