కేటీఆర్ మీటింగ్ కు సగం మంది డుమ్మా

కేటీఆర్ మీటింగ్ కు సగం మంది డుమ్మా

 

  • కోపంతో లంచ్​ చేయకుండానే వెళ్లిపోయిన కేటీఆర్
  • ఎవరూ బతిమిలాడరు, పనిచెయ్యకుంటే ఊరుకోం
  • మీటింగ్​కు​ ఎవరెవరు రాలేదో చూస్తున్నానని వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎలక్షన్ వ్యూహం కోసం మంత్రి కేటీఆర్​ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్​ పార్టీ మీటింగ్​కు సగం మంది లీడర్లు డుమ్మా కొట్టారు. హైదరాబాద్ సిటీకి చెందిన వారంతా రావాలని ఆదేశించగా.. సగం మందే రావడంతో కేటీఆర్​ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవర్నీ బతిమిలాడేది లేదని, అలిగి ప్రచారం చేయకుండా ఉంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మీటింగ్​కు ఎవరొచ్చారో, రానోళ్లు ఎవరో చూస్తున్నానన్నారు. మీటింగ్ తర్వాత పార్టీ లీడర్లతో కలిసి కేటీఆర్​ భోజనం చేయాల్సి ఉన్నా మధ్యలోనే వెళ్లిపోయారు. పార్టీ సెక్రటరీ జనరల్ కేకే, మంత్రులు గంగుల కమలాకర్, మహమూద్ అలీ, తలసాని, డిప్యూటీ స్పీకర్ పద్మారావు మిగతా మీటింగ్​ను కొనసాగించారు.

హైదరాబాద్​ గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఎలక్షన్​ ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం కోసం సిటీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఓడిపోయిన పార్టీ క్యాండిడేట్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ చైర్మన్లు, ఇతర లీడర్లను ఆహ్వానించారు. అయితే చాలా మంది రాలేదు. మీటింగ్ కు అటెండైన లీడర్ల సంఖ్యను చూసి కేటీఆర్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ‘‘మీటింగ్ కు ఎవరొచ్చారు, రానోళ్లు ఎవరో చూస్తున్నా.. అలిగి ఇంటికాడ ఉంటే ఊరుకోం. ఎవరు బతిమిలాడరు. ఒకటికి రెండు సార్లు ఫోన్ చేసి మీటింగ్ కు రావాలని చెప్పినా ఎందుకు రాలేదు..” అని మండిపడ్డట్టు సమాచారం. రానివారెవరో లెక్కలు తీయాలని కేటీఆర్  ఆదేశించగా.. ఇద్దరు ముగ్గురు మినహా కొత్త కార్పొరేటర్లంతా వచ్చారని, ఓడిపోయినవారిలో చాలావరకు రాలేదని పార్టీ వర్గాలు తేల్చాయి. దీంతో ‘‘పదవుల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న వాళ్లు ఉన్నారు. వెంటనే పదవులు రావు. అవకాశాలను బట్టి వస్తాయి’’ అని నామినేటెడ్  పోస్టులను ఉద్దేశిస్తూ కేటీఆర్  పేర్కొన్నట్టు తెలిసింది. తర్వాత ఎలక్షన్​ ప్రచార వ్యూహాలపై కాసేపు మాట్లాడిన కేటీఆర్  మీటింగ్  మధ్య నుంచే వెళ్లిపోయారు. ఆశించిన స్థాయిలో లీడర్లు మీటింగ్ కు రాలేదన్న అసహనంతోనే కేటీఆర్  అలా వెళ్లిపోయారని, లేకుంటే అందరితో కలిసి భోజనాలు చేసేవారని లీడర్లు మాట్లాడుకోవడం కనిపించింది.

ఎంత కాలం ఎదురు చూడాలె?

మీటింగ్ కు అటెండైనవారిలో చాలా మంది నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నవారేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదిగో, ఇదిగో అంటున్నారే తప్ప పదవులు ఇవ్వడం లేదని వారు అసహనం వ్యక్తం చేశారని వెల్లడించాయి. ‘‘పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినయ్. ఇంతవరకు నామినేటెడ్ పదవి ఇవ్వలేదు. మా ఎమ్మెల్యే కూడా చెప్పిండు. అయినా ఏ పోస్ట్ ఇవ్వట్లేదు’’ అని సిటీకి చెందిన ఓ లీడర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరో లీడర్​ మాట్లాడుతూ.. ‘‘పార్టీ ఆవిర్భావం నుంచీ పనిచేస్తున్నా.. గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఏదో పదవి ఇస్తామన్నరు. మళ్లీ కలిస్తే ఒట్టు. ఎలక్షన్లు రాగానే కేడర్ గుర్తుకు వస్తరు. మిగతా సమయంలో పట్టించుకునే నాథుడే లేరు’’ అని మండిపడ్డారు.

వాణిదేవికి క్లీన్ ఇమేజ్: కేటీఆర్‌‌‌‌

హైదరాబాద్​ ఎమ్మెల్సీ టీఆర్ఎస్​ క్యాండిడేట్​ వాణిదేవికి క్లీన్ ఇమేజ్ ఉందని, గ్రాడ్యుయేట్లకు ఈ అంశం నచ్చుతుందనే నమ్మకం ఉందని మంత్రి కేటీఆర్  పేర్కొన్నారు. ఆమె ఎంపికను ప్రత్యర్థులు సైతం మెచ్చుకుంటున్నారని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ భవన్​లో మీటింగ్​కు సంబంధించి ఓ ప్రెస్​నోట్​ రిలీజ్​ చేశారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తే.. అది
కేంద్రం ఘనతగా బీజేపీ చెప్పుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉన్నది గానీ భవిష్యత్తు లేదని కామెంట్​ చేశారు. ఈ రెండు పార్టీలు కూడా టీఆర్ఎస్​ క్యాండిడేట్​ను ప్రశ్నించే పరిస్థితుల్లో లేవని పేర్కొన్నారు.