భీమదేవరపల్లి, వెలుగు: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ముల్కనూర్, వేలేర్, ధర్మారం ఇతర గ్రామాల నుంచి జాతరకు వచ్చే రహదారులపై గుంతలు పూడ్చటానికి జంగిల్ కటింగ్ తదితర పనులపై అలసత్వం వహించిన ఆర్అండ్ బీ ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో పనులు జాతర ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని దేవాదాయ శాఖ అధికారులు ఆదేశించారు.
కొత్తగా ఏర్పాటు చేసిన త్రిశూలం చౌరస్తాతో పాటు పని చేయకుండా ఉన్న సోలార్ విద్యుత్ లైట్లను సరిచేయాలన్నారు. కొండపైకి వెళ్లే రహదారి నిర్మాణాన్ని అధికారులు పరిశీలించాలని సూచించారు. అనంతరం సర్పంచ్ సిద్ధమల్ల రమా రమేశ్ మాట్లాడుతూ జాతర నేపథ్యంలో కొత్తకొండలో ప్రతి ఇంటికీ బంధువులు వస్తారని, రోడ్డు సరిగా లేదని మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ ను కోరారు. సమావేశంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామాల సునీత, ఎన్పీడీసీఎల్ ఎస్సీఈ మధుసూదన్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
