సీబీఐని ఒక్కరోజు నాకు అప్పగిస్తే.. బీజేపీలో సగం మంది జైలుకే : కేజ్రీవాల్

సీబీఐని ఒక్కరోజు నాకు అప్పగిస్తే.. బీజేపీలో సగం మంది జైలుకే  : కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐలను తనకు ఒక్కరోజు అప్పగిస్తే... బీజేపీలో సగం మంది జైలులో ఉంటారన్నారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా NDTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో  కేజ్రీవాల్  ఈ కామెంట్స్ చేశారు.  తమ నియంత్రణలో ఉన్న వివిధ కేంద్ర ఏజెన్సీల ద్వారా దాదాపు 200 కేసులు నమోదు చేసినప్పటికీ.. ఏ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిపైనా ఒక్క అవినీతి ఆరోపణను కూడా బీజేపీ రుజువు చేయలేకపోయిందన్నారు. ఆప్ నేతలపై దాదాపు 200కు పైగా కేసులు పెట్టారు. ఇందులో 150కిపైగా కేసుల్లో ఆప్‌ నేతలు క్లియర్‌ అయ్యారని, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇలాంటి చెత్త కేసులను నమోదు చేసినందుకు ఏజెన్సీలు రోజూ కోర్టులను ఆశ్రయిస్తున్నాయన్నారు.

ఇక ఢిల్లీలో  గత ఏడేళ్లలో ఎన్నో పనులు చేశామని, ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చామని కేజ్రీవాల్ తెలిపారు.  ప్రజలు మా నుండి ఏమి ఆశించారో వాటిని అందించామన్నారు. ప్రజలు మళ్లీ తమ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని కేజ్రీవాల్ తెలిపారు. ఎంసీడీ ఉద్యోగులకు  ప్రతి నెల 1న జీతాలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీలో కాలుష్యం అనేది ఒక జాతీయ సమస్య  అని అన్నారు. బీహార్‌లో, ఉత్తరప్రదేశ్‌లో ఇతర ప్రాంతాలల్లో కూడా  కాలుష్యం ఉందని,  కానీ దీనిపై  కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించారు. పొల్యూషన్‌పై రాజకీయాలు చేసి వేలెత్తి చూపించడం మాత్రమే చేస్తే ఏమీ రాదన్నారు.  కాగా, డిసెంబర్‌లో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.