శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించండి

శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించండి
  •     నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలి
  •     ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించిన కేంద్రం
  •     ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ భేటీ 

న్యూఢిల్లీ, వెలుగు :  శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్ మేనేజ్​మెంట్​బోర్డు(కేఆర్ఎంబీ)కు అప్పగించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను వెంటనే రూపొందించి, వారం రోజుల్లో అప్పగించే పనులు ప్రారంభించాలని స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోజు రాత్రి సాగర్‌‌ ప్రాజెక్టు వద్ద చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో బుధవారం మరోసారి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. 

ఈ భేటీకి తెలంగాణ తరఫున ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్, ఏపీ నుంచి ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణ రెడ్డి హాజరయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ మీటింగ్​లో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్, మెయింటెనెన్స్, సెక్యూరిటీపై ప్రధానంగా చర్చించారు. ఇరు రాష్ట్రాల అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ.. రెండు ప్రాజెక్టుల ఆపరేషన్, మెయింటెనెన్స్, సెక్యూరిటీ వంటి అంశాలను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. గతంలో కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో ఉన్న రిజర్వాయర్ మేనేజ్​మెంట్​కమిటీ (ఆర్ఎంసీ)ని పునరుద్ధరించాలని, ఈ కమిటీ విధివిధానాలను రూపొందించాలని పేర్కొన్నారు.