ఏపీకి విహారి గుడ్ బై.. త్రిపురకు ప్రాతినిధ్యం వహించనున్న తెలుగు క్రికెటర్

ఏపీకి విహారి గుడ్ బై.. త్రిపురకు ప్రాతినిధ్యం వహించనున్న తెలుగు క్రికెటర్

న్యూఢిల్లీ: తెలుగు బ్యాటర్‌‌ హనుమ విహారి.. డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌లో ఆంధ్రప్రదేశ్‌‌ను వదిలేసి త్రిపురకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 2025–26 సీజన్‌‌కుగాను  త్రిపుర క్రికెట్‌‌ అసోసియేషన్‌‌తో ఏడాది కాలానికి ఒప్పందం చేసుకున్నాడు. పరస్పర అంగీకారంతో దీన్ని పొడిగించుకునే అవకాశం ఉంది. 2023–24 రంజీ సీజన్‌‌ సందర్భంగా ఆంధ్ర క్రికెట్‌‌ అసోసియేషన్‌‌తో తలెత్తిన వివాదం తర్వాత ఏపీ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడే చాన్స్‌‌ రావడం లేదని విహారి వెల్లడించాడు. 

అందుకే త్రిపురకు మారానని తెలిపాడు. ‘నాకు మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉంది. కాబట్టే ఇతర అవకాశాలపై ఆసక్తిగా ఉన్నా. టీ20 ఫార్మాట్‌‌ కోసం యువ ఆటగాళ్లను చూస్తున్నామని ఆంధ్ర తెలిపింది. అందుకే ఒక్క 50 ఓవర్ల ఫార్మాట్‌‌లో ఆడటం కరెక్ట్‌‌ కాదని నిర్ణయించుకున్నా. ఇందులో భాగంగానే విజయ్‌‌ హజారే ట్రోఫీకి దూరంగా ఉన్నా. కొత్త వాతావరణంలో మరో జట్టుతో కలిసి ఆడాలని కోరుకుంటున్నా’ అని విహారి పేర్కొన్నాడు. వివాదం తర్వాత ఆంధ్ర క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ చాలా పక్షపాతం చూపిందని ఆరోపించిన విహారి.. అప్పట్లోనే వైదొలిగేందుకు ప్రయత్నించాడు.