హనుమ విహారి..డ్యుయల్‌ రోల్​ కు ఫిట్‌!

హనుమ విహారి..డ్యుయల్‌  రోల్​ కు ఫిట్‌!

విహారి టెస్ట్‌‌ క్రికెట్‌‌ వయసు కేవలం ‘ఏడు ఇన్నింగ్స్‌‌లు’. కానీ విండీస్‌‌తో తొలి టెస్ట్‌‌కు ముందు హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌ శర్మను కాదని అతనికి తుది జట్టులో చోటు ఇచ్చాడు విరాట్‌‌. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. ఐదు రోజుల ఫార్మాట్‌‌లో తెలుగు కుర్రాడి భవిష్యత్ ఏంటో అర్థం చేసుకోవడానికి. అసలు కెప్టెన్‌‌ను, టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ను విహారి ఇంతలా ఆకట్టుకోవడానికి కారణలేంటి? ప్రస్తుతం ఇండియా టెస్ట్‌‌ టీమ్‌‌ను ఓసారి పరిశీలిస్తే టాప్‌‌–4 వరకు పెద్దగా ఇబ్బందుల్లేవు. ఓపెనింగ్‌‌లో ధవన్‌‌కు తోడుగా రాహుల్‌‌, మయాంక్‌‌ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వన్‌‌డౌన్‌‌లో పుజార, తర్వాత కోహ్లీ.. ఈ స్థానాలను మార్చే చాన్సే లేదు. కానీ వచ్చిన ఇబ్బంది మొత్తం.. మిడిలార్డర్‌‌లోని కీలకమైన ఐదు, ఆరు స్థానాలే. రహానె ఐదుకు సరిపోయినా.. ఆరులో ఎవరు? అన్నదే పెద్ద ప్రశ్న. ఈ స్థానంలో రోజుల తరబడి ఆడుతూ పైన రహానెకు, కింద లోయర్‌‌ ఆర్డర్‌‌కు మంచి సమన్వయాన్ని అందించే ఆటగాడి కోసం కసరత్తులు జరిగినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. కానీ విండీస్‌‌తో తొలి టెస్ట్‌‌లో విహారి రూపంలో ఓ నాణ్యమైన బ్యాట్స్‌‌మన్‌‌ ఈ స్థానం కోసం అందుబాటులో వచ్చాడు.

నమ్మదగిన బ్యాట్స్‌‌మన్‌‌

చిన్న కెరీరే అయినా.. కోహ్లీ డ్రీమ్‌‌ ఎలెవన్‌‌లో విహారికి చోటు దక్కింది. అంటే తెలుగు కుర్రాడిలో ఉన్న బ్యాటింగ్‌‌ నైపుణ్యంపై కెప్టెన్‌‌కు మంచి గురి కుదిరినట్లే. దీనికితోడు బ్యాటింగ్‌‌ లైనప్‌‌లో ఆధిపత్యం కొనసాగుతున్న తరుణంలో తనకంటూ ప్రత్యేకమైన రూట్‌‌ను ఏర్పాటు చేసుకున్నాడు విహారి. టెస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌ ఎలా ఆడాలి.. పరుగులు ఎలా రాబట్టాలో చాలా త్వరగా నేర్చుకున్నాడు. బ్యాటింగ్‌‌ శైలి పాతతరాన్ని పోలినా.. రెండు అంశాలు మాత్రం అతన్ని చాలా ప్రత్యేకంగా నిలిపాయి. ఒకటి.. తనకు ఏది కావాలి అన్న దానిపై కచ్చితమైన అవగాహన ఉండటం. రెండోది.. అది తన కెరీర్‌‌కు ఎలా ఉపయోగపడుతుందో కూడా స్పష్టంగా తెలిసి ఉండటం. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న యువ క్రికెటర్లలో ఈ రెండు అంశాలు లోపించడం వల్లే..  చాలా మంది అలా వచ్చి ఇలా కనుమరుగవుతున్నారు. విహారి బ్యాటింగ్‌‌.. మిగతా యువ క్రికెటర్లు లేదా విరాట్‌‌ అంత గొప్పగా ఉండకపోవచ్చు. కానీ స్వీయ అవగాహనతో ఆడటం అతని స్పెషల్‌‌. తొలి టెస్ట్​లో రెండో ఓవర్‌‌లోనే కోహ్లీ ఔటైనా.. అంత ఒత్తిడిలోనూ విండీస్‌‌ పేసర్‌‌ గాబ్రియెల్‌‌ను ఎదుర్కొన్న తీరే ఇందుకు నిదర్శనం. స్ట్రోక్‌‌ మేకింగ్‌‌లోను, డిఫెన్స్‌‌లోనూ ఎలాంటి తడబాటు లేకుండా ఆడటం అతిపెద్ద సానుకూలాంశం. గాబ్రియెల్‌‌ వేసిన హాఫ్‌‌ వ్యాలీని మిడాఫ్‌‌లో ఫోర్‌‌ కొట్టిన తీరు కళ్లను కట్టి పడేసింది. అవసరాన్ని బట్టి ఫుల్‌‌, స్వీప్‌‌ షాట్లను కూడా అలవోకగా ఆడేశాడు.

హార్దిక్‌‌ వస్తే..

ఇంగ్లండ్‌‌పై అరంగేట్రంలో హాఫ్‌‌ సెంచరీ చేసిన విహారికి ఆ తర్వాత పెద్దగా చాన్స్‌‌లు రాలేదు. రొటేషన్​ పాలసీ, బ్యాటింగ్‌‌ లైనప్‌‌లో మార్పులు, తనకు తానుగా చేసిన కొన్ని తప్పుల వల్ల అవకాశాలు మిస్సయ్యాయి. దీంతో కాస్త ఆందోళనకు గురైన విహారి.. ఫామ్‌‌తో ఇబ్బందులుపడ్డాడు. కానీ ఎవర్ని నిందించకుండా తప్పులను సరిదిద్దుకుని సక్సెస్‌‌ సాధించాడు. ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్‌‌లో ఒకే ఒక్కసారి డకౌటైనా.. మిగతా అన్నిసార్లు మినిమమ్‌‌ 46 బంతులు క్రీజులో ఉన్నాడు. ఓపెనింగ్‌‌ వెళ్లమని ఆదేశించినా సంతోషంగా వెళ్లాడు. మిడిలార్డర్‌‌లో ఆడమన్నా ఆడాడు. అంటే టీమిండియా లైనప్‌‌లో తనకూ స్థానం ఉండాలని పరోక్షంగా కోహ్లీకి తెలిసేలా చేశాడు. కానీ ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ జట్టులోకి వస్తే.. విరాట్‌‌ నలుగురు బౌలర్ల వ్యూహాంతో వెళ్తే అప్పుడు విహారికి చోటు కష్టమే. ఇదో పెద్ద ట్రాజెడీ అయినా వీలైనన్నీ అవకాశాలు ఇస్తే మాత్రం విహారి టెస్ట్‌‌ కెరీర్‌‌ అద్భుతంగా సాగుతుందడంలో సందేహం లేదు. కాబట్టి మేనేజ్‌‌మెంట్‌‌, కెప్టెన్‌‌ లాంగ్‌‌ రన్‌‌ను దృష్టిలో పెట్టుకుని విహారికి ఎక్కువ చాన్స్‌‌ ఇవ్వాలి.

ఆఫ్‌‌ స్పిన్‌‌ మెరుగుపడితే..

విహారి ప్రైమ్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ అయినా.. మంచి ఆఫ్‌‌ స్పిన్‌‌ వేయగల నేర్పరి. ఇందులో ఇంకాస్త మెరుగుపడితే ‘ఐదో బౌలర్‌‌’ అప్షన్‌‌కు అతను కచ్చితంగా ఉపయోగపడతాడు. సమీప భవిష్యత్‌‌లో అశ్విన్‌‌ అందుబాటులో ఉన్నా లేకపోయినా.. విహారికే ఎక్కువ చాన్స్‌‌ ఉంటుంది. ఎందుకంటే ఆరో నంబర్‌‌లో ఉపయుక్తమైన బ్యాట్స్‌‌మన్‌‌గా, ఆఫ్‌‌ స్పిన్నర్‌‌గా ద్విపాత్రాభినయం చేయొచ్చు. ప్రస్తుతం ఎక్స్‌‌ట్రా బ్యాట్స్‌‌మన్‌‌ను తీసుకోవాలంటే అశ్విన్‌‌ను పక్కనబెడుతున్నారు. జడేజా ఏకైక స్పిన్నర్‌‌గా సేవలందిస్తున్నాడు. ఇలాంటి సమయంలో రెండో స్పిన్నర్‌‌గా విహారి కూడా ఉపయోగపడతాడు.  ఒకవేళ ఐదుగురు బౌలర్ల వ్యూహం అయితే జడేజా కంటే విహారికే చాన్స్‌‌ ఎక్కువగా ఉంటుంది.  ‘టీమ్‌‌ అవసరాలకు అనుగుణంగా నా ఆఫ్‌‌ స్పిన్‌‌ను మెరుగుపర్చుకోవాలి. కాంబినేషన్‌‌ ప్రకారం ఐదో బౌలర్‌‌ ఆప్షన్‌‌కు నేనే ఉండాలి. కాబట్టి బౌలింగ్‌‌ను మరింత పటిష్టం చేసుకోవాలి. సీనియర్లతో డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌ పంచుకోవడం చాలా ఆనందం. ఆఫ్‌‌ స్పిన్‌‌లో మెళకువలు తెలుసుకునే అవకాశం దక్కుతుంది’ అని విహారి పేర్కొన్నాడు. సో విండీస్‌‌పై టెస్ట్‌‌ సెంచరీ మిస్‌‌ అయినా.. రాబోయే కాలంలో విహారి పేరుమీద ఎన్నో సెంచరీలు చూస్తామని ఆశిద్దాం..!

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి