తెలంగాణ జానపద కళారూపాలు: ఒగ్గుకథ - విశిష్టత, ప్రముఖ కళాకారులు

తెలంగాణ జానపద కళారూపాలు: ఒగ్గుకథ - విశిష్టత, ప్రముఖ కళాకారులు

ఒగ్గుకథ  ఒగ్గు అనే వాయిద్యంతో కథ చెప్పే కళారూపమే ఒగ్గుకథ. ఒగ్గు అనేది కూడా చర్మ వాద్యమే. ఇది శివుని చేతిలోని ఢమరుకాన్ని పోలి ఉంటుంది. తెలంగాణ ప్రాంతానికి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిన కళారూపం ఒగ్గుకథ. ఒగ్గుకథలను సాధారణంగా కురుమ కులస్తులు చెబుతారు. వారే కాకుండా గొల్ల, ఇతర బీసీ కులాల వారు కూడా ఒగ్గుకథలు చెబుతుంటారు. 
    
తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ఒగ్గుకథ చెప్పే కళాకారులు ఉన్నారు. ఒగ్గుకథ చెప్పే జట్టులో దాదాపు ఐదుగురు ఉంటారు. సాధారణంగా కథకుడు తలకు రుమాలు చుట్టుకుని కాళ్లకు గజ్జెలు కట్టుకుని కథ చెబుతుంటే  పక్కనున్న వాయిద్యకారులు వంతపాడుతుంటారు. ఒక పెద్ద డోలు, తాళాలు, ఒగ్గు ప్రధాన వాయిద్యాలుగా ఉంటాయి. 
    
ఒగ్గు కళాకారులు చెప్పే కథల్లో బీరప్పకథ, మల్లన్న కథ, ఉప్పలమ్మకథ, కాటమరాజు కథ, ఎల్లమ్మ కథ, నల్లపోచమ్మ కథ, మాంధాత కథ ముఖ్యమైనవి. ఉగ్గు గొల్లలు, ఎర్రగొల్లలు నృత్యగానాల ద్వారా ఎల్లమ్మ కథను ప్రదర్శిస్తారు. 
    
ముఖ్యంగా పండుగలు, జాతర సమయాల్లో ఒగ్గుకథ ప్రదర్శిస్తారు. కోయ తెగలోని చందన వంశస్తులు తెలంగాణలో మేడారం రాజ్యం కోసం కాకతీయులతో పోరాడిన వీరవనిత సమ్మక్క కథలను చెబుతారు. 
    
హిందూ మత సంప్రదాయాల్లో మొదట గణపతిని ప్రార్థిస్తారు. అయితే, ఒగ్గుకథలో మహాంకాళిదేవిని స్తుతిస్తారు. తెలంగాణలో వేములవాడ ప్రాంతంలో ఎక్కువ ఒగ్గుకథ బృందాలు ఉన్నాయి.

చుక్కా సత్తయ్య

తెలంగాణ ఒగ్గుకథ పితామహుడు, ఒగ్గు కళా సామ్రాట్​గా గుర్తింపు పొందిన చుక్కా సత్తయ్య ప్రస్తుత జనగామ జిల్లా మణిక్యపురం గ్రామంలో జన్మించారు. తన చిన్న తనంలోనే ఒగ్గుకథలో ప్రావీణ్యం సంపాదించారు. 13 ఏండ్ల చిరుప్రాయంలోనే చిరుతల రామాయణంలోని హనుమంతుడి పాత్రను ధరించాడు. అనంతరం కళపై పట్టు సాధించి దేశ, విదేశాల్లో వేల కొద్దీ ప్రదర్శనలు ఇచ్చారు. లెక్కలేనన్ని సన్మానాలు, అవార్డులు పొందారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం చుక్కా సత్తయ్య కళను మెచ్చుకున్నారు. 

మిద్దెరాములు 
తెలంగాణలో ఒగ్గుకథకు విశిష్టత చేకూర్చిన కళాకారుల్లో మిద్దె రాములుది ప్రత్యేక స్థానం.  ఎందుకంటే ఆయన ఒగ్గుకథలు చెప్పే కులానికి చెందినవారు కాదు. గౌడ కులస్తుడైన రాములు పట్టుబట్టి మరీ ఒగ్గుకథ నేర్చుకున్నాడు. అనంతరం దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. ఆకాశవాణి, దూరదర్శన్​లో 200 ప్రదర్శనలిచ్చాడు. రాములు తన ప్రదర్శనలో తలపై కుండ పెట్టుకుని, దానిపై కంచుడులో దీపం వెలిగించి, చేతిలో వేప మండలు పట్టుకుని నేర్పుగా తల మీద కుండ కింద పడకుండా నేలకు వంగి నేలపై ఉన్న రూపాయి కాయిన్​ను నుదురుతో అందుకోవడం ముఖ్యమైంది.