
హనుమకొండ, వెలుగు : హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ బైకర్ రికార్డు స్థాయిలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశాడు. మూడేండ్లుగా వివిధ ప్రాంతాల్లో రూల్స్ పాటించకుండా బండి నడపడంతో మొత్తం 109 చలాన్లు పడ్డాయి. బుధవారం సాయంత్రం పోలీసులకు చిక్కడంతో బైక్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... హనుమకొండకు చెందిన భిక్షపతి అనే వ్యక్తి తన టీఎస్03ఈఎస్9020 నంబర్ గల గ్లామర్ బైక్‌తో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ తిరుగుతున్నాడు.
ఈ క్రమంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒకసారి, వరంగల్ కమిషనరేట్ పరిధిలో 108 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడంతో పోలీసులు మొత్తం 109 చలాన్లు విధించారు. ఇందులో 2022 మే నుంచి డిసెంబర్ వరకు ఏడు నెలల్లోనే 67 చలాన్లు, 2023లో 40 చలాన్లు, 2025లో ఇప్పటివరకు రెండు చలాన్లు పడ్డాయి. మొత్తం చలాన్లకు సంబంధించి రూ. 26,310ల ఫైన్ పెండింగ్‌లో ఉంది.
బుధవారం సాయంత్రం హనుమకొండ ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి స్థానిక అశోక జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. బైక్‌పై అటువైపు వచ్చిన భిక్షపతిని ఆపి చలాన్లు చెక్ చేయగా.. రికార్డు స్థాయిలో కనిపించడంతో షాక్ అయ్యారు. అనంతరం బండిని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. చలాన్లు క్లియర్ చేశాక బండిని అప్పగిస్తామని చెప్పారు.