ప్రేమ పేరిట వేధింపులు.. విద్యార్థిని సూసైడ్

ప్రేమ పేరిట వేధింపులు.. విద్యార్థిని సూసైడ్

దండేపల్లి, వెలుగు: ప్రేమ పేరుతో వేధించడంతో పాటు విద్యార్థుల ముందే కొట్టడడంతో అవమానంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పెద్దపేటకు చెందిన బొడ్డు ఐశ్వర్య(17), స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అదే కాలేజీలో చదివే కొండాపూర్ గ్రామానికి చెందిన కండ్లపల్లి అజయ్ కొంతకాలంగా ప్రేమిస్తున్నాంటూ ఐశ్వర్య వెంటపడుతూ వేధిస్తున్నాడు. ఈనెల 24న కాలేజీలో జరిగిన ఫంక్షన్‎లో తనను ప్రేమించకపోతే విషం తాగి చచ్చిపొమ్మని తోటి విద్యార్థుల ముందు ఆమెను అజయ్ కొట్టాడు.

దీంతో కాలేజీకి చెందిన ఓ లెక్చరర్ ఐశ్వర్యను తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, మరుసటి రోజు అతడి వేధింపులు, అవమానం భరించలేక గడ్డి మందు తాగింది. కుటుంబసభ్యులకు చెప్పడంతో చికిత్సకోసం లక్షెట్టిపేట ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‎లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయింది. ఐశ్వర్య తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తహసీనోద్దిన్ తెలిపారు.