- కొమ్రం భీమ్ జిల్లాలో విషాదం
కాగజ్ నగర్, వెలుగు : వరకట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తుండడంతో పెండ్లయిన పది నెలలకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందో బాధితురాలు. కొమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలు కుటుంబీకుల కథనం ప్రకారం...కౌటాల సమీపంలోని శివలింగాపూర్ కు చెందిన దోంగ్రే ప్రహ్లాద్, లహాను బాయిలకు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి. వీరిలో రెండో కూతురు సంధ్య (20) ఇంటర్చదివింది. ఈమెను కౌటాలకు చెందిన రౌతు రేవాంజి(వీఆర్ఏ) కొడుకు రౌతు జయంత్ కు ఇచ్చి గత ఏడాది నవంబర్14న పెండ్లి చేశారు. పెండ్లి టైంలో సంధ్య తల్లిదండ్రులు రూ.మూడున్నర లక్షల నగదు ఇస్తామని ఒప్పుకున్నారు. కానీ సర్దుబాటు కాకపోవడంతో కల్యాణలక్ష్మి కింద వచ్చిన రూ.లక్ష ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఇవ్వలేదు. దీంతో భర్త, అత్తా మామల వేధింపులు ఎక్కువయ్యాయి. అత్తవారింట్లో గొడవలతో రెండు నెలల పాటు తల్లిగారింటికి వచ్చి ఉంది. తల్లిదండ్రులు, పెద్దలు సర్ది చెప్పడంతో తిరిగి వెళ్లింది. తర్వాత భార్యభర్తలిద్దరూ ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లి ప్రైవేట్జాబ్స్ చేసుకుంటున్నారు.
దసరా పండుగ సందర్భంగా నాలుగు రోజుల క్రితం సంధ్య, జయంత్ కౌటాలకు వచ్చారు. ఇక్కడ కట్నం విషయంలో గొడవలు జరిగాయి. భర్త, అత్తా మామలు వేధించడంతో పుట్టింటికి వెళ్లింది. ఆదివారం ఉదయం కౌటాలలోని అత్తగారింట్లో కుల పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు. ఈ టైంలో సంధ్య మామ రేవంజి, ఇతర కుటుంబీకులు మాట్లాడిన మాటలకు మనస్తాపం చెందింది. అక్కడ నుంచి తల్లిగారింటికి వెళ్లి పురుగుల మందు తాగింది. స్థానికులు ఆమెను సిర్పూర్ టి సివిల్ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ స్వామి తెలిపారు.
