న్యూఢిల్లీ: దేశంలోనే మొదటిసారిగా కోర్టు ద్వారా కారుణ్య మరణానికి అనుమతి పొందిన హరీశ్ రాణా (31) మంగళవారం కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు దశలవారీగా ఆయనకు చికిత్సను నిలిపేసి మరణాన్ని ప్రసాదించారు. పంజాబ్ యూనివర్సిటీలో బీటెక్ స్టూడెంట్‌గా ఉన్న హరీశ్ 2013లో తన నివాసం ఉండే బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
అనేక ఆసపత్రుల్లో చికిత్స అందించినా, అతడి ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. 11 ఏండ్లుగా అతడు కోమాలోనే ఉండిపోయాడు. కుమారుడి చికిత్స కోసం ఆర్థికంగా, మానసికంగా చితికిపోయిన హరీశ్ తల్లిదండ్రులు అతడి కారుణ్య మరణానికి అనుమతించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మెడికల్ రిపోర్టులను పరిశీలించిన అనంతరం హరీశ్ రాణాకు చికిత్సను నిలిపేయొచ్చని మార్చి 11న కోర్టు తీర్పు వెలువరించింది.
